డీఎంకేకు ప్రశాంత్‌ కిశోర్‌ సేవలు

3 Feb, 2020 04:52 IST|Sakshi
స్టాలిన్‌, ప్రశాంత్‌ కిశోర్‌

చెన్నై: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ సేవలను వినియోగించుకుంటున్న రాజకీయ పార్టీ్టల్లో తాజాగా డీఎంకే కూడా చేరింది. తమిళనాడులో 2021లో జరిగే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రశాంత్‌ కిశోర్‌కు చెందిన సంస్థ ‘ఇండియన్‌ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ(ఐప్యాక్‌)’ సహాయం తీసుకోనున్నామని ఆదివారం డీఎంకే అధినేత స్టాలిన్‌ ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. స్టాలిన్‌ ట్వీట్‌పై ఐప్యాక్‌ కృతజ్ఞతలు తెలిపింది. ‘2021లో విజయమే లక్ష్యంగా తమిళనాడులో డీఎంకేతో కలిసి పనిచేసేందుకు ఉత్సుకతతో ఉన్నాం’ అని ట్వీట్‌ చేసింది.

గత పదేళ్లుగా విపక్షంలో ఉంటున్న డీఎంకే.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అన్నాడీఎంకే నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని భావిస్తోంది. సినీ నటుడు కమల్‌హాసన్‌ పార్టీ ‘మక్కల్‌ నీది మయ్యం’ కూడా ప్రశాంత్‌ కిశోర్‌ వ్యూహాలను వాడుకోనుందని కొంత కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. గత సంవత్సరం జరిగిన లోక్‌సభ ఎన్నికలను డీఎంకే దాదాపు స్వీప్‌ చేసింది. మొత్తం 39 లోక్‌సభ స్థానాల్లో 38 సీట్లను డీఎంకే గెలుచుకుంది. 2019లో జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రం రెండు అసెంబ్లీ స్థానాలను అన్నాడీఎంకే గెల్చుకుంది. ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయం కోసం, పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ కోసం ప్రశాంత్‌ కిశోర్‌ సంస్థ ఐప్యాక్‌ పనిచేస్తున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు