సీటివ్వలేదని కుర్చీలెత్తుకెళ్లాడు..

31 Mar, 2019 09:47 IST|Sakshi

సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌ : ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ టికెట్‌ ఆశించి భంగపడ్డ వాళ్లు కోపాన్ని, అసంతృప్తిని తలోరకంగా వ్యక్తం చేస్తారు. కొందరు తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో దిగితే, మరి కొందరు టికెట్‌ ఇచ్చే మరో పార్టీలోకి దూకేస్తారు. అయితే, మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే అబ్దుల్‌ సత్తార్‌ పార్టీ ఆఫీసులోని కుర్చీలను ఎత్తుకెళ్లిపోయి తన కోపాన్ని వినూత్నంగా వెల్లడించాడు.

సిలోడ్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయిన సత్తార్‌ ఔరంగాబాద్‌ లోక్‌సభ టికెట్‌ కోసం ప్రయత్నించాడు. అయితే, అధిష్టానం ఆయనకు టికెట్‌ ఇవ్వలేదు. దాంతో కోపించిన సత్తార్‌ స్థానిక పార్టీ కార్యాలయం ‘గాంధీభవన్‌’లో ఉన్న 300 కుర్చీలను తన మద్దతుదారుల సాయంతో ఇంటికి తీసుకెళ్లిపోయాడు. ఆ కుర్చీలన్నీ తనవేనని, టికెట్‌ ఇవ్వనందున తాను కాంగ్రెస్‌ను వదిలేస్తున్నానని చెప్పాడు.

తాను పార్టీలో లేనప్పుడు తన కుర్చీలు ఎందుకుండాలని చెప్పి ఇంటికి తీసుకెళ్లిపోయానని వివరణ ఇచ్చాడు. మిత్రపక్షమైన ఎన్‌సీపీతో కలిసి గాంధీభవన్‌లో సమావేశం జరపాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఈ సంగతి తెలిసిన సత్తార్‌ సమావేశానికి ముందే కుర్చీలన్నీ తీసుకెళ్లాడు. కుర్చీలు లేకపోవడంతో సమావేశాన్ని ఎన్‌సీపీ ఆఫీసుకు మార్చాల్సి వచ్చింది.

అలా అని సత్తారేమీ తక్కువోడు కాదు. జిల్లాలో ఆయనకు పలుకుబడి బాగా ఉంది. పార్టీ నాయకులు మాత్రం సత్తార్‌కు ఏదో అవసరం వచ్చి కుర్చీలు తీసుకెళ్లాడని, టికెట్‌ ఇవ్వనందుకు ఆయనకేం కోపం లేదని సర్దిచెబుతున్నారు.  

మరిన్ని వార్తలు