ఎమ్మెల్యేకు ఎదురు దెబ్బ

22 Jan, 2018 09:03 IST|Sakshi
ఎమ్మెల్యే సనాతన్‌ మహాకుడు

బ్యాంకు ఖాతాలు స్తంభన

రూ. 165 కోట్లు జమ అయినట్టు గుర్తింపు

భువనేశ్వర్‌: చంపువా నియోజకవర్గం ఎమ్మెల్యే సనాతన్‌ మహాకుడు బ్యాంకు ఖాతాల్ని స్తంభింపజేశారు. ఈ ఖాతాల్లో ఆయన పేరు మీద రూ. 165 కోట్లు జమ అయి ఉన్నట్లు గుర్తించారు. రూ. 50 లక్షల నగదుకు సంబంధించిన వివరణ సంతృప్తికరంగా లేనందున ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు ఖాతాని ఇటీవల స్తంభింపజేశారు. బాసుదేవ్‌పూర్‌లో ఎమ్మెల్యే ఇంటి నుంచి బ్యాంకు సిబ్బంది వ్యక్తిగతంగా తీసుకు వెళ్తుండగా పోలీసులకు చిక్కారు. ఈ వ్యవహారంపట్ల బ్యాంకు అధికార వర్గం, ఎమ్మెల్యే సంతృప్తికరమైన వివరణ దాఖలు చేయడంలో విఫలం అయ్యారు. ఈ సంఘటనలో ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒకరు బ్యాంకు మేనేజరుగా పేర్కొన్నారు. బ్యాంకు ఖాతా లావాదేవీల్ని స్తంభింపజేసి వివరణ కోరుతు పోలీసులు ఎమ్మెల్యేకి తాఖీదు జారీ చేశారు. వివరణ దాఖలు చేసేందుకు ఎమ్మెల్యే 20 రోజుల గడువు కోరినట్లు తెలిపారు. ఆరోగ్య కారణాలతో గడువు అభ్యర్థించడంతో అనుమతించారు. గడువు ముగిసిన ఎమ్మెల్యే పోలీసుల ముందు హాజరు కానందున బ్యాంకు ఖాతాల్ని స్తంభింపజేసినట్లు తెలిపారు.

కొత్త పార్టీ సన్నాహాలు!
స్వతంత్ర అభ్యర్థిగా కొనసాగుతున్న కెంజొహర్‌ జిల్లా చంపువా నియోజకవర్గం ఎమ్మెల్యే సనాతన్‌ మహాకుడు సొంత పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ప్రాథమిక ప్రక్రియ ముగిసింది. జన సమృద్ధ పార్టీ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. ప్రజా ప్రాతినిథ్యం చట్టం–1951 సెక్షన్‌ 29–ఎ కింద కొత్త పార్టీకి దరఖాస్తు దాఖలు చేశారు. భారత ఎన్నికల కమిషను ఆమోదం కోసం నిరీక్షిస్తున్నారు. కెంజొహర్‌గొడొ కాశీపూర్‌–బలరామ్‌పూర్‌ పార్టీ ప్రధాన కార్యాలయంగా నమోదు చేశారు.

కొత్త పార్టీ అధ్యక్షుడు సనాతన్‌ మహాకుడు కాగా సరోజ్‌ సాహు కార్యనిర్వాహక అధ్యక్షునిగా ప్రాథమిక దరఖాస్తులో వివరాల్ని దాఖలు చేశారు. వీరివురితో మరో 8 మందిని పార్టీ సభ్యులుగా పేర్కొన్నారు. అభ్యర్థన మేరకు అంతా సజావుగా ముగిస్తే జన సమృద్ధ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా 147 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులు పోటీ చేస్తారని సనాతన్‌ మహాకుడు ప్రకటించారు. శ్రీ జగన్నాథుడు కొలువుదీరిన శ్రీ క్షేత్రం(పూరీ) నుంచి పార్టీ కార్యకలాపాల్ని  ప్రారంభించనున్నట్లు తెలిపారు. పూరీ నుంచి కెంజొహర్‌ జిల్లా ఘొటొగాంవ్‌ మా తరిణి దేవస్థానం వరకు కొత్త పార్టీ కార్యకర్తలు ఊరేగింపు నిర్వహించేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారు. ఈ సన్నాహాల వెనక అదృశ్య హస్తం ఉన్నట్లు అధికార పక్షం బిజూ జనతా దళ్‌ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పార్టీ తీవ్ర ప్రకంపనలు ప్రేరేపిస్తుందని సనాతన్‌ అనుచరులు ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు.

కెంజొహర్‌ జిల్లా గనుల అక్రమ తవ్వకాల నిధులతో ఇదంతా సాగుతున్నట్లు రాజకీయ శిబిరాల్లో ఊహాగానాలు ముమ్మరంగా సాగుతున్నాయి. సనాతన్‌ లోగడ సనా సేన పేరుతో ఒక సంస్థ నిర్వహించారు. నిన్న మొన్నటి వరకు సనాతన్‌ మహాకుడు అధికార పక్షం బిజూ జనతా దళ్‌లో చేరుతారని భావించారు. ఈ ఊహలు తలకిందులు కావడంతో రాజకీయంగా చర్చనీయాంశం అయింది. కెంజొహర్‌ జిల్లా దళిత వర్గాలత్లో సనాతన్‌ మహాకుడుకు గట్టి పట్టు ఉంది. సనాతన్‌ మహాకుడు ఏర్పాటు చేసిన కొత్త పార్టీ అధికార పక్షం బిజూ జనతా దళ్‌కు కెంజొహర్‌ జిల్లాలో పక్కలో బల్లెంగా మారుతుందని కాంగ్రెసు, భారతీయ జనతా పార్టీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు