అసెంబ్లీలో ఎమ్మెల్యే కన్నీళ్లు

19 Feb, 2019 07:54 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌ ఎమ్మెల్యే ఒకరు అసెంబ్లీలో కన్నీటి పర్యంతమయ్యారు. న్యాయం జరగకపోతే ఆత్మహత్యే తనకు శరణ్యమని వాపోయారు. అసెంబ్లీలో సోమవారం జీరో అవర్‌ సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే కల్పనాథ్‌ పాశ్వాన్‌ తన సమస్యను చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అజాంగఢ్‌లోని ఓ హోటళ్లో ఉండగా తన వద్ద ఉన్న రూ. 10 లక్షలను ఎవరో ఎత్తుకెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

‘మీకు చేతులెత్తి దండం పెడ్తున్నా. ఇక్కడ కాకపోతే నాకు ఇంకెక్కడ న్యాయం లభిస్తుంది? నేను చాలా పేదవాడిని.. ఆ డబ్బు తిరిగి దక్కకపోతే ఆత్మహత్య చేసుకుంటాను. దీనిపై ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు కాలేదు’ అంటూ ఏడ్చేశారు. ఎమ్మెల్యేనైన తనకే న్యాయం జరక్కపోతే సామాన్యుడి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. సభలోని ఇతర ఎమ్మెల్యేలు కల్పనాథ్‌ సీటుకు దగ్గరికి వచ్చి ఆయనకు సంఘీభావం ప్రకటించారు. వెంటనే న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. దాంతో, న్యాయం జరిగేలా చూస్తానని శాసనసభ వ్యవహారాల మంత్రి సురేశ్‌ ఆయనకు హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు