‘ఈ సభతో ప్రజలకేం సందేశం ఇచ్చావ్‌’

3 Sep, 2018 14:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘కేసిఆర్ నీ షో... ప్లాఫ్‌ షో. అసలింతకు ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు ఏమైనా సందేశం చేరిందా.. లేదా’ అంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డీ కే అరుణ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావ్‌ని ప్రశ్నించారు. సోమవారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రగతి నివేదన సభతో కేసీఆర్‌ ఆట ముగిసిందన్నారు. సభకు 25 లక్షల మంది జనాలు హాజరవుతారన్నారని ‍ప్రచారం చేశారు.. కానీ కేవలం రెండున్నర లక్షల మంది మాత్రమే సభలో పాల్గొన్నారని తెలిపారు. సభ ప్రాంగణం కూడా నిండలేదు.. ఏదో విహార యాత్రకు వచ్చినట్లు వచ్చి వెళ్లారంటూ ఎద్దేవా చేశారు. ఉద్యోగులకు ఐఆర్‌ ప్రకటించలేదు.. నిరుద్యోగ యువతను పట్టించుకోలేదు. అసలు ఈ సభతో కేసీఆర్‌ తెలంగాణ ప్రజలకు ఏం సందేశం ఇచ్చారో తెలపాలంటూ ఆమె డిమాండ్‌ చేశారు.

సెంటిమెంట్లతో ఎంతో కాలం మోసం చేయలేరనే విషయం నిన్న జరిగిన సభ చూస్తే అర్థమవుతోందని ఆమె తెలిపారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ని తిరస్కరిస్తున్నారనే విషయం నిన్నటి సభతో స్పష్టంగా తెలిసిందన్నారు. కేసీఆర్ లేకుంటే రాష్ట్రం మరింత ముందుకు పోయేదని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. ముందస్తు పెట్టి, నవంబర్‌లో చెక్కులు ఇచ్చి ఓట్లు వేయించుకోవాలని అనుకుంటున్నారు.. కానీ ఎరువుల ధరలు పెంచి రైతులపై భారం మోపుతున్నారని మండిపడ్డారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయని ఆమె ఆరోపించారు.

మరిన్ని వార్తలు