కత్తిమీద సాము.. కలెక్టర్‌ గిరీ

19 Dec, 2019 09:04 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: ఒకే పార్టీకి చెందిన ఇద్దరు మంత్రుల మధ్య ఏడాది కాలంగా నెలకొన్న విభేదాలు ...  మంత్రికి, ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎంపీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే అగ్గి... రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా మారిన కరీంనగర్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల నిర్వహణ... రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడం... కరీంనగర్‌ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కొండూరు శశాంకకు సవాల్‌గా నిలవనున్న ప్రాధాన్యత గల అంశాలు ఇవేనేమో..!  అతిపెద్ద జిల్లా స్థాయి నుంచి కేవలం 16 మండలాలకు తగ్గిపోయిన కరీంనగర్‌ జిల్లాలో అన్ని స్థాయిల్లో చైతన్యం పాలు ఎక్కువే. ప్రశ్నించే తత్వం ప్రజల్లో బలంగా ఉండగా... రాజకీయ చైతన్యం జాతీయ స్థాయిలో పేరెన్నిక గన్నదే. జిల్లాల పునర్విభజన జరిగిన తరువాత మూడేళ్లకు పైగా జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వర్తించిన సర్ఫరాజ్‌ అహ్మద్‌ అనూహ్య పరిస్థితుల్లో జిల్లా నుంచి నిష్క్రమించాల్సిన అనివార్యత తలెత్తింది. ఈ పరిస్థితుల్లో కరీంనగర్‌ జిల్లాపై పూర్తి అవగాహన గల కె.శశాంక నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించడాన్ని ప్రజలతోపాటు రాజకీయ నాయకులు కూడా స్వాగతిస్తున్నా... ఇక్కడున్న పరిస్థితుల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రజా ప్రతినిధులను, వివిధ శాఖలను సమన్వయం చేసుకోవడంలో ఎంత మేర విజయం సాధిస్తారనేదే అందరికి ఆసక్తిని కలిగిస్తోంది. 

అధికార పార్టీ ఒరలోనే రెండు కత్తులు!
జిల్లాకు సంబంధించి అధికార పార్టీలో వైరుధ్య వాతావరణం నెలకొంది. కరీంనగర్‌ జిల్లా పరిధిలోకి కరీంనగర్‌తోపాటు మానకొండూరు, హుజురాబాద్, చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా... ఈ నాలుగు స్థానాల నుంచి ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీనియర్‌ మంత్రిగా హుజూరాబాద్‌కు చెందిన ఈటల రాజేందర్‌ ఉండగా... వివిధ సమీకరణాల నేపథ్యంలో నాలుగు నెలల క్రితం కరీంనగర్‌కు చెందిన గంగుల కమలాకర్‌ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచే అంతర్గతంగా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్టు ప్రచారం జరిగినప్పటికీ... రెండో విడత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏర్పాటైన కేబినెట్‌ కూర్పు నుంచి దూరం పెరిగింది. చివరి నిమిషంలో మంత్రివర్గంలోకి ఈటల రాజేందర్‌ మరోసారి చేరగా, గత సెప్టెంబర్‌లో జరిగిన విస్తరణలో గంగులకు అవకాశం వచ్చింది. మంత్రివర్గ విస్తరణ తరువాత ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు పెరిగాయి.

ఒకరు హాజరైన కార్యక్రమానికి మరో మంత్రి వచ్చిన దాఖలాలు లేవు. ఇటీవల జరిగిన జిల్లా పరిషత్‌ సమావేశంలో ఆ విషయం స్పష్టమైంది. కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమాలకు సైతం ఇద్దరు మంత్రులు ఏకకాలంలో హాజరైన దాఖలాలు లేవు. కరీంనగర్‌లో జరిగే అధికారిక సమావేశాలలో చాలా వరకు మంత్రి ఈటల రావడమే మానేశారు. ఇటీవల వైద్యశాఖకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో సమీక్ష సమావేశాన్ని ఏకంగా తన సొంత నియోజకవర హుజూరాబాద్‌లో ఏర్పాటు చేసుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన శశాంక ఇద్దరు మంత్రులను ఏమేరకు సమన్వయం చేసుకుంటారో, ప్రోటోకాల్‌ ఇబ్బందులు లేకుండా ఎలా వ్యవహరిస్తారో చూడాల్సిందే. 

మంత్రి గంగులకు ఎంపీ బండి సంజయ్‌ మధ్య అగ్గి
అసెంబ్లీ ఎన్నికల్లో రెండుసార్లు కరీంనగర్‌ నుంచి గంగుల కమలాకర్‌ చేతిలో ఓడిపోయిన బండి సంజయ్‌ కరీంనగర్‌ ఎంపీగా అనూహ్య విజయాన్ని సాధించి, రాష్ట్రంలో బీజేపీకి కీలక నేతగా మారారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని రేసులో ఉన్న సంజయ్‌కి కరీంనగర్‌ జిల్లాలో మంత్రి గంగులకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రోటోకాల్‌లో మంత్రుల తరువాత కరీంనగర్‌ ఎంపీగా సంజయ్‌కే ప్రాధాన్యత ఉన్నప్పటికీ, ఆయన మంత్రిగా గంగుల పాల్గొన్న ఏ కార్యక్రమానికీ రాలేదు. స్మార్ట్‌సిటీ, అభివృద్ధి పనులకు సంబంధించి ఇద్దరు వేర్వేరు సమీక్షలు నిర్వహించారు. రానున్న మునిసిపల్‌ ఎన్నికల్లో ప్రధానంగా టీఆర్‌ఎస్, బీజేపీల మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో ఇద్దరు నేతలను జిల్లా కలెక్టర్‌ ఎలా సమన్వయం చేసుకుంటారనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

పాత పరిచయాలు అనుకూలంగా..
ప్రోటోకాల్‌ సమస్య ఉత్పన్నం కాకుండా ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకోవడం జిల్లా కలెక్టర్‌గా శశాంక ముందున్న సవాల్‌. గతంలో జగిత్యాల సబ్‌ కలెక్టర్‌గా, కరీంనగర్‌ మునిసిపల్‌ కమిషనర్‌గా సుధీర్ఘకాలం పనిచేసిన శశాంకకు జిల్లాపై పూర్తి పట్టుండడం కలిసొచ్చే అంశం. అభివృద్ధి, సంక్షేమ పథకాలను జిల్లా ప్రజలకు అందించే విషయంలో గత అనుభవాలు ఆయనకు ఉపయోగకరంగా చెప్పవచ్చు.మంత్రి గంగుల, ఎంపీ సంజయ్, గత పాలకమండలి సభ్యులు, అధికారులతో ఉన్న సంబంధాలు కూడా కార్పొరేషన్‌ ప్రత్యేకాధికారిగా వ్యవహరించే కలెక్టర్‌ శశాంకకు వచ్చే ఎన్నికల్లో అనుకూలిస్తాయని భావిస్తున్నారు. 

మరిన్ని వార్తలు