జనసేనకు సిద్ధాంతాలు లేవు..

17 Jan, 2020 11:55 IST|Sakshi

ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌

సాక్షి, విశాఖపట్నం: కేవలం టీడీపీ కోసమే జనసేన పార్టీని పవన్‌కల్యాణ్‌ నడిపిస్తున్నారని.. ఆ పార్టీకి సిద్ధాంతాలు లేవని ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ ధ్వజమెత్తారు. శుక్రవారం విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  జనసేన-బీజేపీ పొత్తు కొత్తది కాదని.. 2014లోనే టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేశాయని చెప్పారు. పొత్తులు, కూటములపై వైఎస్సార్‌సీపీకి ఎలాంటి అభ్యంతరాలు లేవని స్పష్టం చేశారు.  ప్రత్యేక హోదా కానీ, రాష్ట్ర ప్రయోజనాలు కానీ పవన్‌కు అవసరం లేదని.. ఆయన పొలిటికల్‌ ఫ్రీలాన్సర్‌గా పనిచేస్తున్నారని విమర్శించారు. కుటుంబ పాలన ఎవరిదో ప్రజలు తెలుసుకునే 2019లో తీర్పు నిచ్చారని చెప్పారు.

రాష్ట్రంలో ఏదో దోపిడీ జరిగిపోతున్నట్లు జనసేన, బీజేపీలు ఆరోపిస్తున్నాయని.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తోన్న 7 నెలల పాలన ప్రజలు చూశారని.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చారని తెలిపారు. కమ్యూనిస్టు భావజాలం ఉందన్న పవన్‌కల్యాణ్‌.. ఇప్పుడు కమ్యూనిస్టులకు బాకీ ఉన్నానా అని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 2024లో అధికారంలో వస్తామని చెబుతున్న పవన్‌.. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారని ఎద్దేవా చేశారు. సిద్ధాంతాలు, స్థిరత్వం,వ్యక్తిత్వం అనేవి పవన్‌ డిక్షనరీలో లేవని దుయ్యబట్టారు. నిన్నటితో జనసేన పార్టీ అధ్యాయం ముగిసినట్టేనన్నారు. ‘సినిమాలైన చేసుకోండి..రాజకీయాలనైనా చేసుకోండి కానీ సినిమా గ్యాప్‌లో మాత్రం రాజకీయాలు చేయొద్దని’ పవన్‌కు  హితవు పలికారు. వైఎస్‌ జగన్‌ మొదటి నుంచి ఒంటరిగానే పోరాడారని..ఒంటరిగానే గెలిచారని  అమర్‌నాథ్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు