సీడ్‌ పార్క్‌ ఏర్పాటు వెనుక కుట్ర

10 Oct, 2017 04:27 IST|Sakshi

 అందుకే మాట్లాడనీయకుండా నా గొంతు నొక్కేశారు

నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య  

జూపాడు బంగ్లా: వ్యవసాయం దండగన్న సీఎం చంద్రబాబు నేడు తంగెడంచలో సీడ్‌పార్కు ఏర్పాటు చేస్తారంటే ప్రజలు నమ్మలేకపోతున్నారని కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య ఎద్దేవా చేశారు. దీని వెనుక ఏదో కుట్ర దాగి ఉందన్నారు. అందుకే సభలో మాట్లాడనివ్వకుండా తన గొంతు నొక్కేశారని విమర్శించారు. కర్నూలు జిల్లా తంగెడంచలో సోమవారం మెగా సీడ్‌పార్కుకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఐజయ్య మీడియాతో మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే అయిన తనను మాట్లాడనివ్వకుండా అడ్డుకోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.

ఒకే సర్వే నంబర్లపై రెండు జీవోలిచ్చిన టీడీపీ ప్రభుత్వం.. 35 బొల్లవరం రెవెన్యూ పరిధిలో 625.40 ఎకరాల భూమి లేకపోయినా మెగాసీడ్‌ పార్కుకు అంత భూమి ఎలా కేటాయించిందని ప్రశ్నించారు. రుణమాఫీ చేశానంటూ గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు.. రైతులకు వ్యక్తిగత చెక్కులు ఎందుకు మంజూరు చేయలేదని ప్రశ్నించారు. చంద్రబాబు ఇప్పటిదాకా చేసిన రుణ మాఫీ వడ్డీలకు కూడా సరిపోలేదని విమర్శించారు. మాఫీ డబ్బు బ్యాంకు ఖాతాల్లో పడకపోతే వెంటనే ఫిర్యాదు చేయాలని, 72 గంటల్లోగా ఆ సమస్యను పరిష్కరిస్తానని సీఎం పేర్కొనటం హాస్యాస్పదమన్నారు.

మరిన్ని వార్తలు