ప్రత్యేక హోదా కోసం యువత పోరాడాలి

28 Feb, 2018 12:51 IST|Sakshi
ప్రత్యేక హోదాపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఐజయ్య, హాజరైన విద్యార్థులు

ఎన్నికల హామీని విస్మరించిన మోదీ

ఓటుకు నోటు’కు భయపడి ప్యాకేజీకి ఒప్పుకున్న చంద్రబాబు

మండిపడ్డ నందికొట్కూర్‌ ఎమ్మెల్యే ఐజయ్య

నందికొట్కూరు: ప్రత్యేక హోదా కోసం యువత ఉద్యమించాల్సిన అవసరముందని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. మంగళవారం పట్టణంలోని బసిరెడ్డి డిగ్రీ మెమోరియల్‌ కళాశాలలో ప్రత్యేక హోదాపై యువతకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఐజయ్య మాట్లాడారు. 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుమలలో వెంకన్న సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చాక విస్మరించారన్నారు. విభజన సమయంలో ప్రత్యేక హోదా పదేళ్లు కావాలన్న వెంకయ్యనాయుడు, పదిహేనేళ్లు కావాలన్న చంద్రబాబు నాయుడు  ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకొని ఏపీని మోసం చేశారన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు భయపడుతున్నారన్నారు. ప్రత్యేక హోదాతోనే యువత భవిష్యత్‌ ఆధార పడి ఉందన్నారు. హోదా వస్తే రాష్ట్రానికి రాయితీతో కూడిన పరిశ్రమలు వస్తాయని, ఫలితంగా నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు.

అమరావతిలో తాత్కాలిక రాజధాని, సచివాలయం ఏర్పాటు పేరుతో రూ.కోట్లలో  ప్రజాధనం వృథా చేయడం తప్ప అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలోని తంగెడంచ ఫారం భూములను జైన్, అంబుజూ కంపెనీలకు తక్కువ ధరకు కట్టబెట్టి, బాధితులకు ఇంతవరకు ఉపాధి చూపలేదన్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌æరెడ్డి ప్రత్యేక హోదా కోసం నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. అందులోభాగంగానే మార్చి 1న కలెక్టరేట్, 5న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద చేపట్టే ధర్నాలకు ప్రజలు, యువత భారీగా తరలిరావాలన్నారు. సదస్సులో పార్టీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగాల భరత్‌రెడ్డి, మిడుతూరు జెడ్పీటీసీ సభ్యుడు యుగంధర్‌రెడ్డి, నాయకులు జనార్దన్‌రెడ్డి, లోకేష్‌రెడ్డి, బసిరెడ్డి కళాశాల కరస్పాండెంట్‌ సత్యనారాయణ పాల్గొన్నారు.  

హోదాను గాంధేయ మార్గంలో సాధించుకుందాం
గాంధేయ మార్గంలో కలిసికట్టుగా పోరాడి ప్రత్యేక హోదాను సాధించుకుందాం. హోదా వస్తే రాష్ట్రంలోనే యువతకు ఉద్యోగం లభిస్తుంది. వేరే రాష్ట్రంలో అక్కడి కంపెనీలు ఆంధ్ర యువతకు ఉద్యోగం ఇచ్చినా చిన్న చూపు చూస్తాయి. ప్రత్యేక హోదా వస్తే మన ఊరిలోనే ఉద్యోగం దొరుకుతుంది. హోదా సాధన కోసం పోరాడుతున్న వైఎస్సార్‌సీపీ వెంట మేమూ ఉంటాం. – రేణుకదేవి, బసిరెడ్డి డిగ్రీ కళాశాల నందికొట్కూరు
 
యువత గళం విప్పితే ఢిల్లీ దద్దరిల్లాలి
యువత గళం విప్పితే ఢిల్లీ దద్దరిల్లాలి. బీజేపీ, టీడీపీలు యువతను తక్కువ అంచనా వేస్తే సత్తా చూపిస్తాం. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం సస్యశ్యామలమవుతుంది. నిరుద్యోగ సమస్య కూడా హోదాతోనే పరిష్కారమవుతుంది. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగ్‌మోహన్‌రెడ్డికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. హోదా కోసం ఆయన వెంట నడుస్తాం.   – యాస్మిన్, బసిరెడ్డి డిగ్రీ కళాశాల, నందికొట్కూరు

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు