కశ్మీర్‌పై కేంద్రం నిర్ణయం సరైనదే : కాంగ్రెస్‌ ఎమ్మెల్యే

6 Aug, 2019 17:41 IST|Sakshi

మీడియాతో చిట్‌చాట్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

సాక్షి, సంగారెడ్డి : కశ్మీర్‌ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షా వైఖరిని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమర్థించారు. అప్పుడున్న పరిస్థితులను బట్టి కశ్మీర్‌ అంశంపై నెహ్రూ చేసిన పని, నేటి పరిస్థితుల నేపథ్యంలో మోదీ, అమిత్‌షా తీసుకున్న నిర్ణయం సరైనవేనని అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. ‘పార్లమెంటు ప్రధాని మోదీ, అమిత్‌షా ఆర్టికల్ 370 రద్దు బిల్లుపై చర్చ సందర్భంగా నెహ్రూపై ఆరోపణలు చేశారు. అది సరైంది కాదు. నాడు 540 సంస్థానాలు ఉండేవి. వాటిలో హైదరాబాద్‌ సంస్థానం నిజాం పాలనలో..  కశ్మీర్ జునగర్ అధీనంలో ఉండేది. భారతదేశంలో విలీనం కావడానికి హైదరాబాద్‌ నిజాం నవాబు ఒప్పుకోలేదు.

కానీ, ప్రజలు భారత్‌లో కలవడానికి సంసిద్ధమయ్యారు. కశ్మీర్‌ రాజు భారత్‌లో విలీన కావడానికి ఒప్పుకున్నాడు. కానీ, ప్రజలు ఒప్పుకోలేదు. నిజాం ఒప్పుకోకపోవడంతో పటేల్‌ రంగంలో దిగారు. ఆయన్ని ఒప్పించి సంస్థానాన్ని భారత్‌లో కలుపుకున్నారు. కశ్మీర్  ప్రజలు పాకిస్తాన్‌లో కలవడానికి ఇష్టపడ్డారు. పాకిస్తాన్‌ నుంచి కశ్మీర్‌ను కాపాడటం కోసం నెహ్రూ ఆర్టికల్  370, 35A తీసుకొచ్చారు. ఒకవేళ ఆ వెసులుబాటు కల్పించకపోతే మనకు ఇబ్బందుదు కలిగేవి. అప్పుడేం జరిగిందో ఇప్పుడున్న వాళ్లకు తెలియదు. ఒకవేళ పాకిస్థాన్ కశ్మీర్‌ను ఆక్రమించుకుంటే ఇప్పుడు చాలా ఇబ్బంది పడే వాళ్లం. అప్పుడున్న పరిస్థితుల్లో మోదీ, షా కూడా అలాంటి నిర్ణయాలే తీసుకునేవాళ్లు. కాంగ్రెస్ ఎప్పుడూ సెక్యులర్ పార్టీయే. ఓటు బ్యాంకు రాజకీయాలు ఎప్పుడూ చేయలేదు. సీట్ల కోసం విధానాలకు భిన్నంగా ప్రవర్తించదు. బీజేపీ ఒక మతానికి చెందిన పార్టీ.

ఆర్టికల్ 370, 35A ఎత్తేయాలని ఆరెస్సెస్‌ ముందునుంచీ అనుకుంది. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో మన ప్రాంతాన్ని కాపాడుకోవడానికి మోదీ, షా ఆర్టికల్‌ 370, 35A రద్దు చేయడం సరైందే. అప్పుటి పరిస్థితుల తగ్గట్టు నాటి ప్రధాని నెహ్రూ చేసింది కూడా సరైందే. కశ్మీర్‌ను కాపాడటంలో నాడు నెహ్రూ కీలక పాత్ర పోషించారు.  కశ్మీర్‌ను నెహ్రూ కాపాడారు కాబట్టే ఈ రోజు మోదీ, షా ఈ నిర్ణయం తీసుకోగలిగారు. దేశానికి బీజేపీ, కాంగ్రెస్‌ రెండు పార్టీలు అవసరమే’అన్నారు.

మరిన్ని వార్తలు