రాజకీయ కోణంలోనే తెలుగు సభలు

16 Dec, 2017 04:29 IST|Sakshi

సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ తెలుగు మహాసభలను భాషాభివృద్ధికోసం కాకుండా రాజకీయకోణంలో నిర్వహిస్తున్నారని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహాసభలకోసం ఆర్భాటం చేస్తున్న ప్రభుత్వం తెలుగు భాష అమలుపై ఆచరణలో చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని అన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు భాషను పెద్దగా పట్టించుకోరని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ దేశ సమగ్రతను, ఐక్యతను కాపాడటంలో ఎంతో కృషి చేశారని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన గొప్ప నాయకురాలు సోనియాగాంధీ అని జీవన్‌రెడ్డి కొనియాడారు. మావోయిస్టుల విధానమే తన విధానమన్న సీఎం కేసీఆర్‌ ఇప్పుడు ఎన్‌కౌంటర్లు చేయడం సరికాదన్నారు. 

ప్రజలకు ఒరిగేదేం లేదు..ప్రపంచ తెలుగు మహాసభలపై డీకే అరుణ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ ద్వారా తెలంగాణ ప్రజలకు ఒరిగేదేమీలేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డీకే అరుణ విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన గురించి గొప్పలు చెప్పించుకోవడానికే రూ. కోట్ల నిధులు వెచ్చించి ఈ మహాసభలు నిర్వహిస్తున్నారన్నారు. శుక్రవారం ఆమె ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్‌ పాలనలో తెలంగాణలో 4 వేల మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం కనీసం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మాటకు కట్టుబడే తెలంగాణ ఇచ్చారు
సోనియా పార్టీ ఖ్యాతిని నిలబెట్టారు: సీఎల్పీనేత జానారెడ్డి  

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ ప్రజల హృదయ ఘోషను అర్థం చేసుకుని, ఇచ్చిన హామీకి కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నాయకుడు కె.జానారెడ్డి చెప్పారు. శుక్రవారం ఆయన ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డితో కలసి అసెంబ్లీ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ చేసిన ఉద్యమానికి భయపడి, విధిలేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చినట్టుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంటున్న మాటల్లో వాస్తవంలేదని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, గుండెకోతను అర్థం చేసుకుని ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అని జానారెడ్డి కొనియాడారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా 19 సంవత్సరాలపాటు సేవలందించిన సోనియా, పార్టీ ఖ్యాతిని నిలబెట్టారని పేర్కొన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి ఢిల్లీ వెళుతున్నందున తాను ప్రపంచ తెలుగు సభలకు హాజరుకాలేక పోతున్నానని చెప్పారు. వ్యక్తిగత రాగద్వేషాలను, మనస్పర్థలను పక్కనబెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్, తెలుగు మహాసభలకు అందరు కవులు, కళాకారులను ఆహ్వానించాలని జానారెడ్డి సూచించారు. అందెశ్రీ వంటివారిని ఆహ్వానించకపోవడం సరికాదన్నారు.

మరిన్ని వార్తలు