ఏం జరుగుతోంది..!

13 Jul, 2018 12:41 IST|Sakshi

కలెక్టర్‌ను అగౌరవ పరిచేలా మాట్లాడలేదంటున్న ఎమ్మెల్యే

మాట్లాడినట్టు  24 గంటల్లో ఆధారాలు చూపితే బహిరంగ క్షమాపణకు సిద్ధం

కలెక్టర్‌కు మద్దతు అంటూ అధికార పార్టీ రాజకీయం

అధికార పార్టీ జోక్యంతో ‘అసలు విషయం’ పక్కదారి

వ్యవహారం సద్దుమణగకుండా టీడీపీ కుటిల యత్నాలు

జిల్లాలో కలెక్టర్‌ ముత్యాలరాజు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మధ్య సాగుతున్న వ్యవహారం జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. అసలు ఏంజరుగుతోంది.. వాస్తవాలు ఏమిటీ అనే చర్చలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే చేస్తున్న డిమాండ్లు ఏంటీ.. అధికారులు ఏం మాట్లాడుతున్నారు. నాలుగు రోజులుగా జిల్లాలో అధికారులు, ఉద్యోగ సంఘాలు వర్సెస్‌ ప్రతిపక్ష ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. జరుగుతున్న పరిణామాలు చూస్తే ఈ ‘రచ్చ’కు అధికార పార్టీ నేతలు ఆజ్యం పోస్తూ ‘ మంత్రి అవినీతి వ్యవహారం’ పక్కదారి పట్టిస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు:  మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అవినీతిపై సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి చేస్తున్న పోరాటాన్ని కొందరు పక్కదారి పట్టించారు. మంత్రి ఇలాకాలో జరిగిన అవినీతిపై ఆధారాలతో సహా కలెక్టర్‌కు సమర్పించినా ఎందుకు చర్యలు తీసుకోరని కాకాణి ప్రశ్నించడాన్ని అధికార పార్టీ స్వార్థప్రయోజనాలకు అస్త్రంగా మలుచుకుందన్న ఆరోపణ లున్నాయి. మంత్రి అవినీతి ఆరోపణలను పక్కదారి పట్టించేందుకు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలను పావులుగావాడుకుంటూ తమ పబ్బం గడుపుకుంటున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కలెక్టర్‌ ముత్యాలరాజును గోవర్ధన్‌రెడ్డి కించపరిచేలా మాట్లాడారని ఉద్యోగ సంఘాలు ఆరోపణలు చేస్తుండగా, తాను కలెక్టర్‌ను అగౌరవపరిచేలా మాట్లాడలేదని, ఒక వేళ తాను మాట్లాడినట్లు ఆధారాలు చూపితే బహిరంగ క్షమాపణ చెబుతానని కాకాణి స్పష్టత ఇచ్చాక కూడా ఈ వ్యవహారం కొనసాగుతుండడం అనుమానాలకు తావిస్తోంది. నిజంగానే అధికారులు, ఉద్యోగ సంఘాలు ఇదంతా చేస్తున్నాయా? లేక తెరవెనుక ఎవరైనా నడిపిస్తున్నారా? అనే అనుమానాలు ఉద్యోగులు, రాజకీయవర్గాలో వ్యక్తమవుతున్నాయి.

మంత్రి అవినీతిని పక్కదారి పట్టించేందుకే..
జిల్లాలో కలెక్టర్‌ వర్సెస్‌ కాకాణి వివాదం నేపథ్యం పరిశీలిస్తే మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అవినీతిపై కాకాణి రచ్చను పక్కదారి పట్టించేందుకే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సర్వేపల్లి నియోజకవర్గం నుంచి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ నుంచి గెలుపొందారు. ఆయనపై పోటీచేసి ఓడిపోయిన సోమిరెడ్డి  ఎమ్మెల్సీ అయి ఆ తర్వాత మంత్రి అయ్యారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య రాజకీయంగా నిరంతర వైరం కొనసాగుతూనే ఉంది. ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో తనకున్న హక్కులను పరిరక్షించుకోవడంతో పాటు అధికార పార్టీ నేతలు మంత్రి సోమిరెడ్డి అండతో, కొన్నిచోట్ల మంత్రే స్వయంగా చేస్తున్న అడ్డగోలు వ్యవహారాలను అడ్డుకుంటూ వస్తుండడంతో రాజకీయంగా వాతావరణం వేడిక్కెంది. ఈ క్రమంలో నియోజకవర్గంలో మంత్రి అండతో జరిగిన కొన్ని అవినీతి వ్యవహారాలు పూర్తి ఆధారాలను ఎమ్మెల్యే సేకరించి దానిపై పోరాటం మొదలు పెట్టారు. ఆధారాలతో కలెక్టర్‌కు కూడా అందజేశారు. తాను ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తే ఎందుకు స్పందించరని కాకాణి ప్రశ్నించారు. దీన్ని అధికార పార్టీ అస్త్రంగా మలుచుకుని, ఉద్యోగులు, అధికారులను రెచ్చిగొట్టి చివరకు కాకాణి వర్సెస్‌ కలెక్టర్‌ వివాదంగా మార్చేసి తెర వెనుక రాజకీయం చేస్తున్నారు.

గోవర్ధన్‌రెడ్డి ఆరోపణలు ఇవీ..
వెంకటాచలం మండలం అనికేపల్లిలో ఫోర్జరీ తీర్మానాలతో రూ.6 కోట్లతో పనులు చేయిస్తున్నారు. ఇందులో మంత్రి సోమిరెడ్డి అవినీతికి పాల్పడి చేసిన ఫోర్జరీ తీర్మానాలపై కనీసం ఎందుకు విచారించరు. కనీసం అభ్యంతరాలను అయినా తెలుసుకోవాలంటున్నారు.
రామదాసు కండ్రికలో పేదలకు చెందిన 20 ఎకరాల భూములను టీడీపీ నేతలు స్వాహా చేయటానికి అంతా సిద్ధం చేసి మంత్రి సిఫార్సులతో పరిహారం పొందడానికి యత్నించారు. దీనిపై కనీస విచారణకు ఆదేశించటంతో పాటు పోలీసులు కేసు నమోదు చేయాల్సి ఉన్నప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోరు.
ఎమ్మెల్యేగా తనను ఆహ్వానించకుండా మత్స్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ మంత్రి బసచేసిన గెస్ట్‌హౌస్‌కు వైఎస్సార్‌సీపీకి చెందిన మత్స్యకారులను వలలు ఇస్తామని ఆహ్వానించి టీడీపీ కండువాలు కప్పి పార్టీ కార్యక్రమంగా మార్చిన వ్యవహారంపై తాను ఫిర్యాదు చేస్తే ఎందుకు స్పందించరు.
మంత్రి సోమిరెడ్డి కుమారుడు ఏ హోదాతో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడని ప్రశ్నించినా స్పందించరు. వీటిపై తాను మాట్లాడితే ఆధారాలతో సహా ఇవ్వాలని అధికారులు కోరారు. జాయింట్‌ కలెక్టర్‌ను కలిసి అన్ని ఆధారాలు సమర్పించాను. ఏం చర్యలు తీసుకోలేదు.

పక్కదారి పడుతోందా!
ఈ పరిణామాల క్రమంలో ఎమ్మెల్యే గోవర్ధన్‌రెడ్డి కలెక్టర్‌ను వ్యక్తిగతంగా దూషించారనేది ఉద్యోగుల సంఘాల వాదన. కలెక్టర్‌ను ఖబడ్దార్‌ అన్నారని, అసమర్థుడని మాట్లాడారని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేయడంతో పాటు శుక్రవారం నుంచి పెన్‌డౌన్‌ చేస్తానని ప్రకటించారు. అయితే దీనికి గోవర్ధన్‌రెడ్డి ఇప్పటికే బదులిచ్చారు. తనకు కలెక్టర్‌పై గౌరవం ఉందని, తాను అధికార పార్టీ అవినీతిని మాత్రమే ప్రశ్నించాను తప్ప కలెక్టర్‌ అవినీతిపరుడని అనలేదని, తాను కలెక్టర్‌ను పరుషంగా దూషించినా తప్పేనని, తాను అలా వ్యవహారించినట్టు 24 గంటల్లో చూపితే బహిరంగంగా క్షమాపణ చెబుతానని ప్రకటించారు. అయితే కాకాణి సవాల్‌కు ఆధారాలు చూపకపోగా, ఉద్యోగ సంఘాలు దీనిపై స్పందించకుండా పెన్‌డౌన్‌ చేస్తామని ప్రకటించాయి. ఈ పరిణామాలు చూస్తుంటే.. ఉద్దేశపూర్వకంగానే కొందరు తెర వెనుక ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలను పక్కదారి పట్టిస్తున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వ్యవహారం కలెక్టర్‌ వర్సెస్‌ గోవర్ధన్‌రెడ్డి కాకుండా పూర్తిగా మంత్రిపై అవినీతి ఆరోపణలు పక్కదారి పట్టాయని తెలుస్తోంది.  మూడు రోజుల నుంచి అధికార పార్టీ నేతలు కొన్ని చోట్ల, మరికొన్ని చోట్ల అధికార పార్టీ నేతల సహకారంతో పరోక్షంగా కలెక్టర్‌కు మద్దతు అంటూ కార్యక్రమాలు సాగుతుండడం అనుమానాలకు బలం చేకూరుతున్నాయి. 

మరిన్ని వార్తలు