టీఆర్‌ఎస్‌ది ఆర్భాటమెక్కువ

31 Jul, 2018 13:08 IST|Sakshi
పార్టీలో చేరుతున్న వారికి కండువాలు కప్పి ఆహ్వానిస్తున్న కిషన్‌రెడ్డి

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఆర్భాటం ఎక్కువ.. ఆలోచన తక్కువ అన్నట్లు తయారైందని బీజేపీ శాసనసబాపక్ష నేత కిషన్‌రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ తమ పథకాలుగా చెప్పకుంటూ.. గొప్పలకుపోవడం తప్ప చేసిందేమీలేదన్నారు. కరీంనగర్‌లోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం నాలుగు పథకాలపై దృష్టిపెట్టి దేశమంతటా అమలు చేస్తుంటే, తెలంగాణలో మాత్రం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా పోయిందన్నారు. రైతుల్లో ఆత్మవిశ్వాసం పెంచేందుకు పంటలకు గిట్టుబాటు ధర చెల్లించాలనే ఉద్దేశంతో వరికి రూ.200, పత్తికి రూ.1000 చొప్పున పెంచితే.. ఆ ధరలకు కొనుగోలు చేయలేని అసమర్థ ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ అని మండిపడ్డారు. పంటలబీమా పథకంపై ప్రచారం నిర్వహించకపోవడంతో రూ.55లక్షలపైచిలుకు ఉన్న రైతుల్లో కేవలం 5లక్షల మంది మాత్రమే వినియోగించుకున్నారని, దీనికి రాష్ట్రప్రభుత్వం విధానాలే కారణమని ఎద్దేవా చేశారు.

టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా ఇప్పటివరకు రేషన్‌ కార్డు ఇవ్వలేకపోవడం దురదృష్టకరమన్నారు. కార్డులపై కేంద్రప్రభుత్వం లోగో పెట్టాల్సి వస్తుందనే కారణంతోనే ప్రింట్‌ చేయడంలేదన్నారు. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే దమ్ము ప్రభుత్వానికి లేకుండాపోయిందన్నారు. ఎన్నికలు సకాలంలో నిర్వహించలేకపోతున్నాం కాబట్టి ప్రత్యేక అధికారుల ద్వారా పంచాయతీల పాలన చేస్తామని మంత్రివర్గం నిర్ణయించడం బాధాకరమన్నారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ఎన్నికలు వాయిదా పడేలా ప్రభుత్వమే ప్రయత్నించిందనే ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఎన్నికలు వాయిదా పంచాయతీ రాజ్‌ స్ఫూర్తికి విరుద్ధమని తెలిపారు. గతంలో సర్పంచ్‌లకే పర్సన్‌ ఇన్‌చార్జిలుగా పదవీకాలం పొడిగించిన విషయాన్ని గుర్తు చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేయాల్సిందిగా డిమాండ్‌ చేశారు. నాలుగేళ్లయినా డీఆర్‌సీ లేకపోవడం, జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రులు లేకపోవడం, ప్లానింగ్‌బోర్డుపై స్పష్టత లేని దుస్థితి నెలకొందన్నారు. మంత్రుల ప్రమేయం లేకుండానే ఏకపక్షంగా పరిపాలన జరుగుతోందని మండిపడ్డారు. కేసీఆర్‌ కుటుంబం అన్ని తామై పనిచేస్తోందని తెలిపారు.

హైదరాబాద్‌లో బోనాల పండుగ జరిగితే ఆహ్వాన పత్రికపై స్థానిక ఎంపీ బండారు దత్తాత్రేయ ఫొటో లేదని, అదే వేరేజిల్లా ఎంపీ కవిత ఫొటో ఎలా పెడతారని ప్రశ్నించారు. నేరెళ్ల ఘటన జరిగి సంవత్సరం పూర్తయినా దళితులపై దాడులు చేసిన అధికారులపై చర్యలు తీసుకోలేదని, ఇసుక అక్రమ రవాణా, లారీలు ప్రాణాలు తీసే సంఘటనలు ఇప్పటికీ ఆగలేదన్నారు. ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానంతో న్యాయం గురించి ఆలోచించడంలేదన్నారు. ఎస్సీ కమిషన్‌ వచ్చి నేరెల్ల ఘటనపై ఆదేశించినా దౌర్జన్యాలు ఆగడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కు తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి, కిసాన్‌ మోర్చా జాతీయ కార్యదర్శి పి.సుగుణాకర్‌రావు, జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్‌కుమార్, రాష్ట్ర నాయకులు కోమల్ల ఆంజనేయులు, కొరివి వేణుగోపాల్, మీస అర్జున్‌రావు, సుజాత రెడ్డి, గాజుల స్వప్న, సుశీల, బేతి మహెందర్‌ రెడ్డి, సాయికృష్ణారెడ్డి, గుడిపాటి జితేందర్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

బీజేపీతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యం
కరీంనగర్‌సిటీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలనతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యమవుతుందని కిషన్‌రెడ్డి అన్నారు. 2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పీఠం కదిలి కరీంనగర్‌తోపాటు రాష్ట్రంలో కమలం జెండా వికసించడం ఖాయమని అన్నారు. నగరంలోని వైశ్యభవన్‌లో కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. పలు పార్టీలు, కుల సంఘాల ముఖ్యనాయకులు ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు. పార్టీ నగర అధ్యక్షుడు బేతి మహేందర్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో సమావేశం సాగింది. బీజేపీ అధికారం చేపట్టిన 2014 నుంచి దేశవ్యాప్తంగా పెనుమార్పులకు శ్రీకారం చుట్టి అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించిందన్నారు. నాలుగేళ్ల ఎన్డీయే హయాంలో ఎలాంటి ఆరోపణలకు ఆస్కారం లేకపోవడం నీతివంతమైన పాలనకు నిదర్శనమన్నారు.

సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో ఇసుక మాఫియా ఆగడాలకు అనేకమంది బలైనా, పోలీసుల దాష్టికానికి పదుల సంఖ్యలో యువత జీవచ్ఛవాలుగా మారినా రాహుల్‌గాందీకి కనిపించలేదా? అని ప్రశ్నించారు. కొత్త రాష్ట్రంలో తాము అభివృద్ధిపథంలో పయనిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలకు శఠగోపం పెట్టారన్నారు. కేంద్ర నిధులు పక్కదారి పట్టిస్తూ తన కుటుంబ  అభివృద్ధే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొరటాల శివరామకృష్ణ, ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు అనూప్, విశ్వబ్రాహ్మణ సంఘం యువజన విభాగం అధ్యక్షుడు రాహుల్, శాతవాహన ఆటో యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులతోపాటు కిసాన్‌నగర్‌ మిత్ర మండలి సభ్యులు, మెడికల్‌ రిప్స్, పలు గ్రామాల నుంచి వచ్చిన వందలాది మందికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డితోపాటు నాయకులు బాస సత్యనారాయణరావు, ఇనుకొండ నాగేశ్వర్‌రెడ్డి సుజాతరెడ్డి, సాయికృష్ణారెడ్డి, గణపతి, వెంకట్‌రెడ్డి, కొట్టె మురళీకృష్ణ, బోయినిపల్లి ప్రవీణ్‌రావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు