వారి ఉడత బెదిరింపులకు బెదరను: ఎమ్మెల్యే మేడా

20 Jan, 2019 18:47 IST|Sakshi

సాక్షి, రాజంపేట: వైఎస్ఆర్‌ జిల్లా రాజంపేట టిడిపిలో విభేదాలు భగ్గుమన్నాయి. స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డిని పిలవకుండానే మంత్రి ఆదినారాయణరెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో మేడా వర్గీయులు మంత్రిని నిలదీశారు. సమావేశాన్ని బహిష్కరించి నిరసన తెలిపారు. పొమ్మనలేక పొగబడుతున్నారంటూ మేడా వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డిని పార్టీ నుంచి బయటకు పంపేందుకు టీడీపీ అధిష్టానం తనదైన శైలిలో రాజకీయం ప్రారంభించింది. అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎంపిక చేసేందుకు నియోజకవర్గాల వారీగా చంద్రబాబునాయుడు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.

త్వరలో రాజంపేట నియోజకవర్గ సమావేశం కూడా ఉంది. దీని కోసం నిన్న రాత్రి ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి తన అనుచరులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సమావేశాన్ని ఆసరాగా చేసుకుని ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ప్రచారం చేపట్టింది. అంతటితో ఆగకుండా ఆయన వ్యతిరేకులతో మంత్రి ఆదినారాయణరెడ్డి సారథ్యంలో రాజంపేటలోనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి స్థానిక ఎమ్మెల్యే మేడాను పిలువలేదు. దీంతో ఆయన వర్గీయులు నేరుగా సమావేశం వద్దకు వెళ్లి.. మంత్రి ఆదినారాయణరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిని నిలదీశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు సమావేశం వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.

జిల్లా టీడీపీ నేతలు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, రాజంపేటలో సమావేశం గురించి తనకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి స్పష్టం చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసిన వారితో కలిసి ఆదినారాయణరెడ్డి సమావేశం నిర్వహించారని, తనకు వ్యతిరేకంగా జిల్లా నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయమై సీఎం చంద్రబాబుతో భేటీ అవుతానని చెప్పారు. జిల్లా నేతల ఉడత బెదిరింపులకు తాను బెదరనని, కార్యకర్తలతో చర్చించి వారి నిర్ణయం మేరకు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.

మరిన్ని వార్తలు