ఎమ్మెల్యే నుంచి ఎంపీగా..

21 Mar, 2019 07:08 IST|Sakshi

ఎమ్మెల్యే టు ఎంపీ.. ఎంపీ నుంచి ఎమ్మెల్యే

శాసన సభకు గెలిచి.. లోక్‌సభ స్థానంలో ఓడి  

ఎమ్మెల్యేగా అపజయం ఎంపీగా జయ కేతనం

ఎన్నికల మహా సంగ్రామంలో జయాపజయాలు

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో చిత్ర విచిత్రాలు  

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో పలువురు నేతలు అసెంబ్లీ, లోక్‌సభకు ఎన్నికై రికార్డు సృష్టించారు. కొందరు తొలుత అసెంబ్లీ స్థానాల నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, ఆ తర్వాత లోక్‌సభలో అడుగిడారు. కేంద్ర మంత్రులుగానూ పనిచేశారు. మరికొందరు లోక్‌సభ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించి, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగి విజయం సాధించారు. మరికొందరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించినా.. లోక్‌సభకు వెళ్లలేకపోయారు. కొందరు అసెంబ్లీ స్థానాల నుంచి విజయం సాధించలేకపోయినా.. పార్లమెంట్‌ చట్టసభలకు మాత్రం ఎన్నికయ్యారు. మరోవైపు  ఒకే పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు తండ్రి, కొడుకు, భార్య, భర్త  ప్రాతినిధ్యంవహించారు. ఇరుగు పొరుగు జిల్లాలకు చెందిన కొందరు  ఇక్కడి నుంచి బరిలోకిదిగి విజయం సాధించగా, మరికొందరుపరాజయం పాలయ్యారు.

అసదుద్దీన్‌ ఒవైసీ
హైదరాబాద్‌ సిట్టింగ్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఎమ్మెల్యేగానే రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. పాతబస్తీలోని చార్మినార్‌ అసెంబ్లీ నుంచి రెండు పర్యాయాలు 1994– 2004 వరకు ప్రాతినిధ్యం వహించారు. అనంతరం 2004లో హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం  నుంచి బరిలో దిగి విజయం సాధించారు. వరసగా మూడు పర్యాయాలు విజయం సాధించి హ్యాట్రిక్‌  కొట్టారు. నాలుగోసారి బరిలో దిగేందుకు నామినేషన్‌ దాఖలు చేశారు

సలావుద్దీన్‌ ఒవైసీ..
హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గానికి వరుసగా ఆరు పర్యాయాలు ప్రాతినిధ్యం వహించిన దివంగత నేత సలావుద్దీన్‌ ఒవైసీ అంతకు ముందు పలు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి గెలుపొందారు. 1960లో మల్లేపల్లి కార్పొరేటర్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి 1962లో పత్తర్‌ఘట్టి, 1967లో యాకుత్‌పురా, 1972లో పత్తర్‌ఘట్టి, 1978లో చార్మినార్, 1983లో చార్మినార్‌ అసెంబ్లీల నుంచి గెలుపొందారు. 1984లో హైదరాబాద్‌ లోక్‌సభ నుంచి బరిలో దిగి వరుసగా ఆరు పర్యాయాలు విజయం సాధించి 1984 నుంచి 2004 వరకు  ప్రాతినిధ్యం వహించారు.

వినాయక్‌రావు..
1957లో హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన వినాయక్‌ రావు అంతకుముందు ముంబై,  హైదరాబాద్‌ స్టేట్‌ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు

సర్వే సత్యనారాయణ
మల్కాజిగిరి లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన సర్వే సత్యనారాయణ కూడా అసెంబ్లీ స్థానం నుంచే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1985 కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2004లో సిద్దిపేట నుంచి, 2009లో మల్కాజిగిరి నుంచి లోక్‌సభకు ఎన్నికై కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2018లో  కంటోన్మెంట్‌ నుంచి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి
పరాజయం పాలయ్యారు.

ఎంఎం హషీం..
1977లో సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించిన ఎంఎం హషీం అంతకు ముందు ఆసిఫ్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. 1967లో అక్కడి నుంచి విజయం సాధించి మంత్రిగా పనిచేశారు. తర్వాత రాజ్యసభ స«భ్యుడిగా కూడా వ్యవహరించారు.

టి.అంజయ్య
1984లో సికింద్రాబాద్‌ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన టి.అంజయ్య కూడా ఎమ్మెల్యేగానే రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అంతకుముందు 1962లో ముషీరాబాద్‌ అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు. అంజయ్య ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా సేవలు
అందించారు.  

ఇలా మరికొందరు కూడా..
హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి వరుసగా మూడు పర్యాయాలు ప్రాతినిధ్యం వహించిన  జీఎస్‌ మెల్కోటే అంతకు ముందు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 1952– 57 వరకు ఎమ్మెల్యేగా, 1957లో రాయచూర్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.  ఆ తర్వాత 1962 నుంచి 1971 వరకు వరుసగా మూడు పర్యాయాలు హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించారు.  ూ సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థా«నానికి వరుసగా రెండు పర్యాయాలు ప్రాతినిధ్యం వహించిన కేఎస్‌ నారాయణ అంతకు ముందు అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు. 1977, 1980లలో సికింద్రాబాద్‌ లోక్‌సభకు ఎన్నికయ్యారు. అంతకు ముందు సికింద్రాబాద్‌ అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారు.
చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించిన సూదిని జైపాల్‌రెడ్డి అంతకు ముందు కల్వకుర్తి అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు. మహబూబ్‌నగర్‌ నుంచి రెండు పర్యాయాలు, అదేవిధంగా మిర్యాలగూడ లోక్‌సభ నుంచి కూడా ప్రాతినిధ్యం వహించి కేంద్ర మంత్రిగా పనిచేశారు.

ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా..
మల్లారెడ్డి
2014లో మల్కాజిగిరి లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన మల్లారెడ్డి ఆ తర్వాత 2018లో  మేడ్చల్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో కొనసాగుతున్నారు.   

మణెమ్మ..
సికింద్రాబాద్‌ ఎంపీగా రెండు పర్యాయాలు పని చేసిన టి.మణెమ్మ ఆ తర్వాత అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. 1987, 1989లలో వరసగా సికింద్రాబాద్‌ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించి ఆ తర్వాత ముషీరాబాద్‌ అసెంబ్లీ నుంచి వరుసగా రెండు పర్యాయాలు గెలుపొందారు.

ఎమ్మెల్యేగా గెలిచి.. ఎంపీగా ఓడి..
బీజేపీ సీనియర్‌ నేతలు బద్దం బాల్‌రెడ్డి, నల్లు ఇంద్రసేనారెడ్డిలు అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించినప్పటికీ లోక్‌సభకు ఎన్నిక కాలేకపోయారు. కార్వాన్‌ నుంచి వరసగా మూడు పర్యాయాలు విజయం సాధించినా హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి తలపడలేక పోయారు. మలక్‌పేట అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన నల్లు ఇంద్రసేనారెడ్డి  నల్లగొండ పార్లమెంట్‌
స్థానానికి పోటీ చేసి అపజయం పాలయ్యారు.
నెల్లూరు జిల్లా ఉదయగిరి అసెంబ్లీ స్థానం నుంచి రెండు పర్యాయాలు విజయం సాధించిన వెంకయ్యనాయుడు (ప్రస్తుత ఉపరాష్ట్రపతి) హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి 1996లో పోటీ చేసి అపజయం పాలయ్యారు.  

అసెంబ్లీలో అపజయం.. లోక్‌సభలో విజయం
∙మహరాజ్‌ గంజ్‌ నుంచి అసెంబ్లీ బరిలో దిగి ఓడిపోయిన బండారు దత్తాత్రేయ ఆ తర్వాత సికింద్రాబాద్‌ లోక్‌సభ నుంచి 1991, 1998, 1999, 2014లలో విజయం సాధించారు. కేంద్ర మంత్రి పదవిని దక్కించుకున్నారు.

మరిన్ని వార్తలు