ఏడు సార్లు గెలిచినా టికెట్‌ ఇవ్వరా..!

15 Mar, 2019 09:02 IST|Sakshi

కావాలనే బీసీల సీట్లు పెండింగ్‌లో..

ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి అసంతృప్తి

సాక్షి, అమరావతి : టీడీపీలో టికెట్ల పంచాయతీ ఆ పార్టీ సీనియర్‌ నేతల్లో తీవ్ర అసహనానికి కారణమైంది. విజయనగరం జిల్లా టీడీపీలో టికెట్ల రగడ కొనసాగుతోంది. ప్రధానంగా బీసీ ఎమ్మెల్యేలకు టికెట్లు కేటాయించే అంశాన్ని చంద్రబాబు కావాలనే పెండింగ్‌లో పెడుతున్నారని టీడీపీ సీనియర్, నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు సీటు ఇవ్వకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. 80 ఏళ్ల వయస్సులో 5 రోజులుగా సీఎం ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నానని వాపోయారు. కనీసం తన వయస్సుని గౌరవించకుండా తిప్పించుకుంటున్నారని మండిపడ్డారు. నెల్లిమర్ల అసెంబ్లీ సీటును నారాయణస్వామికి ఇచ్చే అవకాశం ఉన్నా.. భోగాపురం ఎంపీపీ కర్రోతు బంగార్రాజు, ఆనంద్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు కడగల ఆనంద్‌కుమార్‌ అడ్డుపడుతున్నారనే ప్రచారం సాగుతోంది. పతివాడ తన కుమారుడు అప్పలనాయుడికి టికెట్టు ఆశిస్తున్నట్టు తెలిసింది.

ఇక మరో బీసీ మహిళ ఎమ్మెల్యే మీసాల గీత టికెట్‌ కూడా పెండింగ్‌లోనే ఉన్నట్టు తెలిసింది. తొలి జాబితాలో అవినీతి ఆరోపణలు ఉన్న నేతలకు, రాజులకే అగ్రస్థానం ఇచ్చారని ఆమె ఆరోపించారు. కాగా, తన కుమార్తె అదితికి టికెట్‌ ఇప్పించుకునేందుకు గీతను ఎంపీ అశోక్ గజపతి రాజు టార్గెట్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. గీత ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం శాసనసభా స్థానాన్నితన కుమార్తెకు ఇవ్వాలని అశోక్ పట్టుబడుతున్నట్టు సమాచారం. బీసీ మహిళకు ఒక్క సీటు కూడా ఇవ్వరా అని టీడీపీ తీరుపై బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు