బీసీలకు వెంటనే సబ్సిడీ రుణాలివ్వాలి 

23 May, 2018 01:52 IST|Sakshi

ప్రభుత్వానికి బీసీ సంఘాల డిమాండ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: బీసీ కార్పొరేషన్, బీసీ కుల ఫెడరేషన్ల ద్వారా దరఖాస్తు చేసుకున్న 5.77 లక్షల మందికి సబ్సిడీ రుణాలు వెంటనే మంజూరు చేయాలని 16 బీసీ సంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశం డిమాండ్‌ చేసింది. మంగళవారం బీసీ భవన్‌లో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా సబ్సిడీ రుణాలివ్వలేదని ఆరోపించారు. బీసీ కార్పొరేషన్లకు రూ.5వేల కోట్లు కేటాయించినా అందులో కేవలం రూ.210 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారన్నారు. గ్రామ సభల ద్వారా ఎంపిక చేసి రుణాలిస్తామని మంత్రి పేర్కొనడం అన్యాయమన్నారు. 

ఇలా చేస్తే అధికార పార్టీ నేతలు, అధికారుల చుట్టూ తిరుగుతూ లంచాలివ్వాల్సిన దుస్థితి ఏర్పడుతుందని చెప్పారు. ఇటీవల సబ్సిడీ ట్రాక్టర్లను టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకే ఇచ్చారని, బీసీ రుణాలు కూడా అలాగే ఇస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలో 60 లక్షల బీసీ కుటుంబాలుంటే కేవలం దరఖాస్తు చేసుకున్న 5 లక్షల మందికి రుణాలు ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టారు. అర్హులైన బీసీలందరికీ వెంటనే రుణాలు మంజూరు చేయాలని సంఘం నేత ఎర్ర సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సంఘం నేతలు గుజ్జ కృష్ణ, భిక్షపతి, మల్లేశ్, వేముల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు