బీజేపీ, టీడీపీ దొందూదొందే

21 Jul, 2018 07:56 IST|Sakshi
మాట్లాడుతున్న ఎమ్మెల్యే పీ రవీంద్రనాథ్‌రెడ్డి

కమలాపురం అర్బన్‌ (వైఎస్సార్‌ కడప): బీజేపీ, టీడీపీ దొందూదొందేనని ఎమ్మెల్యే పీ రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మాణాన్ని స్పీకర్‌ అనుమతించడంతో వారి అనుబంధం ఎలాంటిదో అర్థమైందన్నారు. గత పార్లమెంట్‌ సమావేశాల్లో వైఎస్సార్‌సీపీ ఎంపీలు 13 సార్లు ఇచ్చిన అవిశ్వాస తీర్మాణాలను అనుమతించక పోడంతో తమ పార్టీ ఎంపీలు ప్రత్యేకహోదాపై మాట్లాడే అవకాశం లేకుండా పోయిందన్నారు. నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వంలో కొనసాగి, రాష్ట్రంలోని 5 కోట్ల మంది ఆకాంక్ష అయిన ప్రత్యేకహోదాపై సీఎం యూటర్న్‌ తీసుకుని, తన పార్టీ ఎంపీలతో డ్రామా చేయిస్తున్నారని ఆరోపించారు.

సీఎం రాష్ట్ర అభివృద్ధి కోరుకున్నట్లయితే గత పార్లమెంట్‌ సమావేశాల్లో తమ పార్టీ ఎంపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మాణానికి ఎందుకు మద్ధతు ఇవ్వలేదని ప్రశ్నించారు. హోదా కోసం కేంద్రంపై అవిశ్వాస తీర్మాణంతో పాటు తమ పార్టీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేశారని తెలిపారు.  రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించేందుకు మాట తప్పకుండా, మడమ తిప్పకుండా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కట్టుబడి ఎన్నో దీక్షలు, సదస్సులు నిర్వహించారని గుర్తు చేశారు.   సీఎం జిత్తుల మారిన నక్క అని ప్రజలు తెలుసుకున్నారని పేర్కొన్నారు. భవిష్యత్‌లో బీజేపీకి, టీడీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. అలాగే 2012–13, 2016–17కు చెందిన బీమాను రైతులకు చెల్లించకకుండా ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందన్నారు.

2016–17 ఖరీప్‌ సీజన్‌కు చెందిన 24 వేల మంది రైతులకు చెల్లించాల్సిన బీమా చెల్లించలేదన్నారు. ఈ విషయాన్ని బీమా అధికారుల, వ్యవసాయాధికారుల, కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లినా ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈనెల చివరికి రైతులకు వారి ఖాతాలో జమ కాకుంటే రైతులు, రైతు సంఘాలతో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు నిమ్మకాయల సుధాకర్‌రెడ్డి, ఉత్తమారెడ్డి, రాజుపాళెం సుబ్బారెడ్డి, సంబటూరు ప్రసాద్‌రెడ్డి, సుమీత్రారాజశేఖర్‌రెడ్డి, పీవీ కృష్ణారెడ్డి, మారుజొళ్ల శ్రీనివాసరెడ్డి, ఆర్‌వీఎన్‌ఆర్, ఎన్‌సీ పుల్లారెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, అల్లె రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు