చంద్రబాబుకు ఆ ధైర్యం లేదు : గడికోట

12 Jul, 2019 09:28 IST|Sakshi

సాక్షి, అమరావతి : రైతు పక్షపాతి ఎవరో...రైతు ద్రోహి ఎవరో ప్రజలందరికీ తెలుసునని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అన్నారు. రైతాంగం పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఉన్న నిబద్ధతను ఎవరూ ప్రశ్నించలేరని వ్యాఖ్యానించారు. శుక్రవారం అసెంబ్లీ పాయింట్‌ వద్ద ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులకు ఉచిత విద్యుత్‌ అందజేసి వైఎస్సార్‌ వ్యవసాయానికి ప్రాణం పోశారని... రైతు సంక్షేమం కోసం ఆయన అనుసరించిన విధానాలను ఆదర్శంగా తీసుకుని సీఎం వైఎస్‌ జగన్‌ ముందుకు సాగుతారన్నారు. ఇందులో భాగంగా రూ.5 వేల కోట్లతో సీఎం జగన్ ధరల స్థిరీకరణ నిధిని ప్రకటించారని.. అదే విధంగా కౌలురైతుల కోసం ప్రత్యేక చట్టం తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. రైతుల పట్ల ఆయనకు ఉన్న నిబద్దతకు ఇది నిదర్శనమన్నారు.

చర్చకు సిద్ధమా?
సంపూర్ణ రుణమాఫీ చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు.. వ్యవసాయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆర్కే మండిపడ్డారు. ‘ చంద్రబాబు 2017 ఎస్ఎల్బిసి మీటింగ్లో రైతు రుణమాఫీ ఎందుకు ప్రస్తావించలేదు. నేడు రైతు రుణా బకాయిలు వుండటం చంద్రబాబు నిర్వాకం వల్ల కాదా? ప్రివిలైజేషన్ మోషన్ పెడతా అంటున్నారు. ఇందుకు గల నిబంధనలపై చంద్రబాబుకు అవగాహన లేదా? చంద్రబాబు రైతు ద్వేషి. ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు వున్న సాగు విస్తీర్ణం ఎంత? నేడు సాగు విస్తీర్ణం ఎంత? చర్చకు చంద్రబాబు సిద్దమా? ప్రివిలైజేషన్ మోషన్‌పై చర్చకు ప్రభుత్వం సిద్దంగా వుంది’ అని సవాల్‌ విసిరారు.

చంద్రబాబుకు ఆ ధైర్యం ఉందా : గడికోట
రైతుల పట్ల తమ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రైతులకు భరోసా కల్పించేలా ముఖ్యమంత్రి జగన్‌ సభలో ప్రసంగించారని పేర్కొన్నారు. ‘ప్రతిపక్ష టీడీపీ నాడు అధికారంలోకి వచ్చేందుకు రూ. 17200 రుణమాఫీ అని చెప్పింది. కానీ చెల్లించింది రూ. 1500 కోట్లు మాత్రమే. గడిచిన ఐదేళ్ళలో రైతుల రుణాలపై అయిన వడ్డీ రూ.1600 కోట్లు. ఇదీ చంద్రబాబు ప్రభుత్వం చేసిన నిర్వాకం. రైతు రుణాలు మాఫీ చేశాను అనే ధైర్యం చంద్రబాబుకు లేదు. డ్వాక్రా, చేనేత రుణమాఫీ చేయలేని ప్రభుత్వం చంద్రబాబుది’ అని గత ప్రభుత్వ తీరును విమర్శించారు. రైతు సంక్షేమం పట్ల నిబద్ధతతో ఉన్న తమ ప్రభుత్వం వారికి ఏం చేయబోతుందో బడ్జెట్‌లో వెల్లడిస్తామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు