తిమ్మప్పను తక్షణమే విధుల్లో చేర్చుకోవాలి

26 Oct, 2017 03:30 IST|Sakshi

 వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్‌  

జీవో ప్రతిపాదనే లేనప్పుడు ఉద్యోగిని ఎలా సస్పెండ్‌ చేస్తారు? 

సాక్షి, అమరావతి: న్యాయ శాఖలో పనిచేస్తున్న సెక్షన్‌ ఆఫీసర్‌ తిమ్మప్పను నిబంధనలకు విరుద్ధంగా సస్పెండ్‌ చేయడం ప్రభుత్వ దమననీతికి నిదర్శనమని వైఎస్సార్‌సీపీ ఎమ్మల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) విమర్శించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 50 ఏళ్లకు తగ్గించే ఆలోచన, సర్వీసును 30 ఏళ్లకే పరిమితం చేయాలన్న ప్రతిపాదన లేదని బుకాయించిన సీఎం, ఆర్థిక మంత్రి ఇప్పుడు న్యాయశాఖ సెక్షన్‌ ఆఫీసర్‌ను ఎలా సస్పెండ్‌ చేస్తారని ప్రశ్నించారు. అసలు జీవో ప్రతిపాదనే లేనప్పుడు రహస్య జీవో ముసాయిదా ప్రతులను లీక్‌ చేయడం ఎలా సాధ్యమో చెప్పాలన్నారు.

సీఎం చంద్రబాబు ఉద్యోగుల హక్కులను కాలరాస్తూ భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా వారిని తన చెప్పుచేతల్లో పెట్టుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఉద్యోగులను కులాలు, మతాలు, ప్రాంతాలు వారీగా విడదీసి వేధిస్తున్నారనడానికి సెక్షన్‌ ఆఫీసర్‌ తిమ్మప్ప సస్పెండే ఉదాహరణని అని చెప్పారు. ఉద్యోగుల పట్ల వ్యతిరేక వైఖరిని ప్రభుత్వం తక్షణమే మానుకోవాలన్నారు. లేకపోతే ఉద్యోగులకు ప్రతిపక్షం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. వారి హక్కులు, భద్రత కోసం న్యాయస్థానాల్లో, ప్రజాస్వామిక విధానాల్లో పోరాటం చేయడానికి వెనుకాడబోమన్నారు. సెక్షన్‌ ఆఫీసర్‌ తిమ్మప్పను వెంటనే విధుల్లో చేర్చుకోవాలని ఆర్కే డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు