చంద్రబాబు సమాధానం చెప్పాల్సిందే

27 Feb, 2020 16:38 IST|Sakshi

సాక్షి, అమరావతి: పబ్లిసిటీ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంతకైనా దిగజారతారని నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్‌ ఆర్కే రోజా అన్నారు. ప్రజలను రెచ్చగొట్టి, రాజకీయ లబ్ది పొందడానికే ఆయన విశాఖపట్నం వెళ్లారని మండిపడ్డారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రజలు ప్రశ్నిస్తుంటే దిక్కుతోచని చంద్రబాబు విద్వేష రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. గత ఐదేళ్లలో ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. (చంద్రబాబును అడుగుపెట్టనివ్వమంటున్న ఉత్తరాంధ్ర వాసులు)

‘వైజాగ్‌ వాళ్లు ఎవరూ రాజధాని కోరుకోవడం లేదన్న చంద్రబాబును ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేని పరిస్థితి తలెత్తింది. భజన చానళ్లలో తను చెప్పిందే ప్రచారం చేసుకుంటూ తను చెప్పిందే వేదమన్నట్టు చెప్పుకుంటూ ఇన్నాళ్లు ముందుకెళ్లారు. కానీ ఈరోజు పరిస్థితులు తారుమారయ్యాయి. ప్రజల ఆకాంక్షల మేరకు ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ జగన్‌ ఆరోజు విశాఖకు వెళితే టీడీపీ నాయకులు ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడారు. ఎవరు అడిగారు ప్రత్యేక హోదా అని హేళన చేశారు. ప్రజలంతా ఆకాంక్షిస్తున్నారన్న విషయాన్ని గుర్తించి ప్రత్యేకహోదాపై తర్వాత చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారు. మళ్లీ ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతీసేవిధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. రాజధాని అవసరం లేదని ఉత్తరాంధ్ర వాసులు అంటున్నారన్న దానికి ఈరోజు ఉత్తరాంధ్రలో చంద్రబాబు తిరగలేని పరిస్థితి వచ్చింది. రెచ్చగొట్టే ధోరణిలో వెళ్తుతున్నారు. ప్రాంతాల మధ్య గొడవలు సృష్టించి చిచ్చు పెట్టాలన్న ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టంగా కనబడుతోంది.

ఆయన జనచైతన్య యాత్ర చేసుకుంటే ఎవరూ అడ్డుపడరు. కానీ ప్రజలకు సమాధానం చెప్పి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని చంద్రబాబు తెలుసుకోవాలి. పబ్లిసిటీ కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారిపోతారనడానికి ఇది నిదర్శనం. అమరావతిలోని 29 గ్రామాల గురించే ఆలోచిస్తున్నారు కానీ, 13 జిల్లాల అభివృద్ధి గురించి ఆయనకు పట్టడం లేదు. సొంత లాభం గురించి ఆలోచిస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని ప్రజలు గమనించారు కాబట్టే ఉత్తరాంధ్ర, రాయలసీమలో ప్రజలే స్వచ్ఛందంగా ఆయనను తరిమికొట్టే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు ఇప్పటికైనా తెలుసుకుని అధికార వికేంద్రీకరణను స్వాగతించాలి. టీడీపీ బతికి ఉందని చెప్పుకోవడానికే ఇలాంటి అంశాలను తెరపైకి తెస్తున్నారు. గతంలోగా పరిస్థితులు ఇప్పుడు లేవు. ప్రజలు చైతన్యవంతులై చంద్రబాబు డ్రామాలను గమనిస్తున్నారు. కేవలం రెచ్చగొట్టడానికే ఆయన విశాఖకు వచ్చారు తప్పా మరోటి కాదు. ప్రజలకు సమాధానం చెబితేనే ఆయన ముందుకు వెళ్లగలుగుతార’ని ఎమ్మెల్యే రోజా అన్నారు. (చదవండి: పెల్లుబికిన ‍ప్రజాగ్రహం.. విశాఖకు జైకొడితేనే..)

మరిన్ని వార్తలు