చంద్రబాబుపై నిప్పులు చెరిగిన రోజా

12 Dec, 2019 11:26 IST|Sakshi

సాక్షి, అమరావతి: చంద్రబాబు మాటలు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. మార్షల్స్‌ తమతో దురుసుగా ప్రవర్తించారని టీడీపీ నేతలు రాద్ధాంతం చేయడంపై ఆమె గురువారం అసెంబ్లీలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటిసారి ఎమ్మెల్యే అయిన తనకు చంద్రబాబు హయాంలో కనీసం ప్రజా సమస్యలుపై మాట్లాడేందుకు మైక్‌ కూడా ఇవ్వలేదని, తాము నిరసన తెలుపుతుంటే ఆ వీడియోలు బయటకు చూపించలేదని మండిపడ్డారు. అసెంబ్లీ నుంచి తమను మార్షల్స్‌తో బయటకు గెంటేశారని వివరించారు. గత అసెంబ్లీ వీడియోలు బయటపెడితే తమ పట్ల ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో స్పష్టమవుతుందని తెలిపారు.

మొదటిసారి ఎమ్మెల్యే అయిన తనను అసెంబ్లీ నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఏడాదిపాటు సస్పెండ్‌ చేశారని, మహిళా ఎమ్మెల్యేపై కక్ష సాధింపు చర్యలు ఏమిటని సుప్రీంకోర్టు చెప్పినా బుద్ధి తెచ్చుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌కు సంబంధించి రెండువందలకుపైగా సీడీలు బయటపడటం.. వడ్డీకి డబ్బులు ఇచ్చి.. మహిళలను వ్యభిచార కూపంలోకి నెట్టుతున్న వైనాన్ని విజయవాడ సీపీ బయటపెట్టారని, దీనిలో టీడీపీకి చెందిన వాళ్ల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల ప్రమేయం ఉండటంతో దీనిమీద తాను వాయిదా తీర్మానం ఇచ్చానని, కానీ అసెంబ్లీలో దీనిపై చర్చించకుండా.. కామ సీఎం అన్నానని తనను ఏడాదిపాటు సస్పెండ్‌ చేశారని వివరించారు. నిజానికి ఆనాడు ఈనాడు పత్రికలో కాల్‌మనీకి షార్ట్‌కట్‌గా కామ అని పెట్టారని, దానిని తాను అసెంబ్లీలో పేర్కొన్నానని, ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు కూడా సబ్మిట్‌ చేశానని వివరించారు.

సుప్రీంకోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నా తనను అసెంబ్లీలోకి అడుగుపెట్టనివ్వకుండా మార్షల్స్‌ అడుకున్నారని, తనకు అండగా అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ అసెంబ్లీ ఎదుట నిరసన తెలిపినా.. స్పీకర్‌ కాదు కదా కనీసం సెక్రటరీ కూడా రాకుండా అవమానించారని, తమ పట్ల ఘోరంగా ప్రవర్తించారని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు చంద్రబాబు గట్టిగట్టిగా అరుస్తున్నారని, గట్టిగా అరిచినంతమాత్రాన గడ్డిపరక గర్జించలేదని పేర్కొన్నారు. గతంలో నిండు సభలో మీ అందరినీ పాతిపెడతానని బోండ ఉమా ఆనాడు అన్నారని, అప్పుడు చంద్రబాబు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. ప్రజలకు మంచి చేస్తుంటే ఎంతసేపు వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్నారని, చంద్రబాబు అసలు ప్రతిపక్ష నాయకుడా పనికిమాలిన నాయకుడా అని ప్రశ్నించారు. మగధీర సినిమా డైలాగ్‌ల తరహాలో 150మంది రండీ ఒకేసారి సమాధానం చెప్తానని చంద్రబాబు బీరాలు పలుకుతున్నారని, వయస్సు మీద పడుతున్న కొద్దీ ఆయనకు చాదాస్తం ఎక్కువవుతోందని దుయ్యబట్టారు.

మరిన్ని వార్తలు