టీడీపీకి అమ్ముడుపోయిన కోట్ల

8 Mar, 2019 13:31 IST|Sakshi
ఎమ్మెల్యే రోజా, పార్టీ నేతలు

గుండ్రేవుల, వేదవతి ప్రాజెక్టులు గతంలో గుర్తుకు రాలేదా?

హామీల్లోనే చంద్రబాబు అభివృద్ధి   

టీడీపీపై పోరుసభలో నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా

కర్నూలు సీక్యాంప్‌: కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి టీడీపీకి అమ్ముడుపోయారని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా విమర్శించారు. కర్నూలు మండలం గార్గేయపురం గ్రామంలో గురువారం టీడీపీపై పోరుసభ కార్యక్రమం వైఎస్సార్‌సీపీ కోడుమూరు సమన్వయకర్త పరిగెల మురళీకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్‌.కె.రోజా మాట్లాడుతూ..గుండ్రేవుల, వేదవతి ప్రాజెక్ట్‌లను రూ. 8,118 కోట్లతో నిర్మిస్తానని 2014 సాతంత్య్ర దిన వేడుకల్లో చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. ఐదేళ్లవుతున్నా ఆ ప్రాజెక్ట్‌లను పట్టించుకోలేదన్నారు. ప్రాజెక్ట్‌ల సాధన పేరుతో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి టీడీపీకి అమ్ముడుపోయి.. అభివృద్ధి కోసమే పార్టీ మారానని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడం తగదన్నారు. జిల్లాలో కోట్ల, కేఈ కుటుంబాల ఆధిపత్య పోరులో పేదలు సమిధలయ్యారన్నారు. 

ప్రజలూ..అప్రమత్తంగా ఉండండి..
అరాచక పనులు చేసి కొన్ని నెలలపాటు దేశాన్ని అతలాకుతలం చేసిన డేరా బాబా లాగే ఇప్పుడు రాష్ట్రంలో డేటా బాబా సంచరిస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రోజా పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు మాటలు నమ్మితే మరో 20 సంవత్సరాలు రాష్ట్రం అభివృద్ధిలో వెనక్కిపోతుందన్నారు. ఉప ఎన్నికల్లో  నంద్యాలను అమరావతి చేస్తానని నమ్మబలికిన చంద్రబాబు.. ఎన్నికల అనంతరం   మర్చిపోయారన్నారు. వైఎస్సార్‌సీపీ పత్తికొండ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులు, వ్యవసాయం బాగుండాలంటే వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. ఈ సారి ఎన్నికల్లో జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీని గెలిపించాలన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ..చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించాలన్నారు. ఎన్నికల వస్తున్న తరుణంలో డ్వాక్రా మహిళలు, రైతులు ప్రభుత్వానికి గుర్తుకు వచ్చారా అని మండిపడ్డారు.  నందికొట్కూరు సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో కోట్ల, కేఈ కుటుంబాల ఆధిపత్య పోరులో వేలాది కుటుంబాలు దెబ్బతిన్నాయని, వారికి ఏం సమాధానం చెబుతారన్నారు.

కోడుమూరులో ఉల్లి రైతులు అల్లాడిపోతుంటే అండగా నిలవాల్సిన కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి... చంద్రబాబు పంచన చేరి రైతులకు ద్రోహం చేశారన్నారు. కోడుమూరు సమన్వయకర్త పరిగెల మురళీకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందన్నారు. ప్రజలు కరువుకోరల్లో చిక్కుకున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణి రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్‌రెడ్డి, రాష్ట్ర అదనపు కార్యదర్శులు తెర్నేకల్లు సురేందర్‌రెడ్డి, చెరుకుచెర్ల రఘరామయ్య, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగాల భరత్‌ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి తోట వెంకటకృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.కొంతలపాడు శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ముఖ్యనేతలు డాక్టర్‌ శశికళ, మల్లికార్జునరెడ్డి, మిడ్తూరు జెడ్పీటీసీ సభ్యుడు యుగంధర్‌రెడ్డి, కిషోర్‌రెడ్డి, బైరెడ్డి కరుణాకర్‌రెడ్డి, గార్గేయపురం రైతు సంఘం అధ్యక్షుడు సీతారామిరెడ్డి, కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి, కోడుమూరు మైనార్టీ సెల్‌ కన్వీనర్‌ కొట్టముల్లా మహబూబ్‌బాషా, కర్నూలు మండల కన్వీనర్‌ రేమట కాల్వముని స్వామి, ఎస్సీసెల్‌ కన్వీనర్‌ పసుపల నాగరాజు, నాయకులు మునగాలపాడు వెంకటేశ్వర్లు, సోలమోన్,చందు, అనీల్, తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు