బెల్టు షాపుల తొలగింపునకు.. 15 రోజులు గడువు

26 Jul, 2018 03:43 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా

     స్పందించకపోతే మహిళలే స్పందించి ధ్వంసం చేస్తారు 

     ఎక్సైజ్‌ కార్యాలయం వద్ద మద్యం బాటిళ్లను పగులగొట్టిన మహిళలు

     అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే ఆర్‌కే రోజా  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బెల్టు షాపులను తొలగించేందుకు 15 రోజులు గడువు ఇస్తున్నామని, ఆలోగా ప్రభుత్వం స్పందించకపోతే మహిళలే రంగంలోకి దిగి ధ్వంసం చేస్తారని ఎమ్మెల్యే ఆర్‌కే రోజా హెచ్చరించారు. బెల్టుషాపులను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం విజయవాడలోని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ కార్యాలయం వద్ద మద్యం బాటిళ్లను ధ్వంసం చేసి ఆందోళన చేపట్టారు. బెల్టు షాపులను లేకుండా చేయడంతో పాటు, బడికి గుడికి, జాతీయ రహదారులకు సమీపంలో ఉన్న మద్యం దుకాణాలను తొలగించాలని కోరుతూ అంతకుముందు వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం ఎక్సైజ్‌ శాఖ జాయింట్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌ నాయుడుకు వినతిపత్రం అందజేసింది. అనంతరం ఆర్‌కే రోజా మీడియాతో మాట్లాడుతూ మహిళల అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటామని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్‌ అనే తుపాన్‌తో రాష్ట్రంలోని అన్ని వర్గాలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.

ఇంట్లో గృహ హింస జరగడానికి, మహిళలు, బాలికలపై అత్యాచారాలు, రోడ్డు ప్రమాదాలు జరగడానికి మద్యం ప్రధాన కారణమన్నారు. వాటిని నియంత్రించాల్సిన బాధ్యత సీఎంకు ఉన్నా పట్టించుకోకుండా అన్ని నేరాలకు బాధ్యుడయ్యారని విమర్శించారు. ఇన్ని చేస్తూ కూడా చంద్రబాబు సిగ్గు లేకుండా మహిళా సంక్షేమం అంటూ  విజయవాడ రోడ్లపై ర్యాలీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. తన నియోజకవర్గమైన నగిరిలో చంద్రబాబు ఆయన బినామీలకు తప్పుడు దారిలో మద్యం లైసెన్స్‌ ఇచ్చారని ఆరోపించారు. చంద్రబాబు పెట్టిన మొదటి సంతకానికే దిక్కులేకుండా పోయిందని విమర్శించారు. సంతకం పెడితే నిమిషంలోనే అమలులోకి తెచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికే దక్కుతుందన్నారు. చంద్రబాబు చేసిన సంతకాలకు విలువ లేకుండా పోయిందన్నారు. కాల్‌మని, సెక్స్‌ రాకెట్, అత్యాచారాల నిందితులకు టీడీపీ పెద్దలు, ప్రభుత్వ పెద్దలు అండగా నిలుస్తున్నారని ధ్వజమెత్తారు. బెల్టు షాపుల వల్ల ఎక్కడపడితే అక్కడే మద్యం విక్రయాలు చేపడుతున్నందున మహిâýళలు, చిన్న పిల్లలపై అత్యాచారాలు పెరిగిపోయాయని పేర్కొన్నారు. 

నేరస్థుల పట్ల సీఎం తీరుతోనే మహిళలపై అఘాయిత్యాలు 
నేరస్థులను సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ ప్రోత్సహిస్తుండటం వల్లే రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆర్‌కే రోజా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆమె ప్రసంగించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న మహిళా వ్యతిరేక విధానాల ఫలితంగా రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో మహిళల మద్దతు కూడగట్టేలా పార్టీ మహిళా విభాగం పెద్ద ఎత్తున కృషి చేయాలని కోరారు. ముఖ్యంగా తెలుగుదేశం పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిన విషయంపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.

అదే విధంగా పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహిళల సంక్షేమానికి ప్రకటించిన ప«థకాలు, వారి రక్షణకు తీసుకునే చర్యలపై విస్తృతంగా ప్రచారం కల్పించాలని సూచించారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో మహిళలు ఆర్థికంగా ఎలా అభివృద్ధి చెందారో తెలిజేయాలని కోరారు. మద్యం నియంత్రణ లేకపోవడంతోనే నేరాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు భద్రత కరువైందని, ఆడవాళ్లు రోడ్డుపై ఒంటరిగా నడవాలంటే భయపడే పరిస్థితి నెలకొందని పలు జిల్లాల నుంచి హాజరైన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త పద్మావతి, కొల్లి నిర్మిలా కుమారి, కైలా జ్ఞానమణి, కృష్ణవేణి, తాతినేని పద్మావతి, బండి నాగపుణ్యశీల తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు