మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై శ్రీధర్‌ బాబు ధ్వజం

13 Nov, 2019 18:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన నియోజకవర్గంలో జరిగే సమీక్షలకు కూడా పిలవడం లేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీధర్‌ బాబు బుధవారం సీఎ‍ల్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ...‘వ్యక్తిగతంగా ప్రభుత్వానికి నా పై కోపం ఉండొచ్చు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ...లియోనియా రిసార్ట్స్‌లో సింగరేణి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. సింగరేణి ప్రభావిత ప్రాంతంలో నా నియోజకవర్గం కూడా ఉంది.  సమీక్ష నిర్వహించాలంటే సింగరేణి భవన్‌ పెద్దగా ఉంది. అది కాదంటే మంత్రిగారి ఛాంబర్‌ ఉంది. 

మరి రిసార్ట్స్‌లో సమీక్ష ఎందుకు పెట్టారు. మేము అడిగే ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం లేదా?. ఆ సమావేశానికి ఎందుకు పిలవలేదు?. ఆ సమావేశానికి మమ్మల్ని పిలిస్తే వారసత్వ ఉద్యోగాలపై అడిగే అవకాశం ఉండేది. ఓపెన్‌ కాస్ట్‌ మైనింగ్‌ చేయాలనే ఆలోచన చేస్తున్నారు. దాన్ని విరమించుకోవాలని మేము సమావేశంలో చెప్పేవాళ్లం. ప్రభుత్వం తాను చేసే పనులు గోప్యంగా ఉంచుతోంది. ఓ వైపు ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంటే... మరోవైపు సింగరేణిపై రిసార్ట్స్‌లో రివ్యూ చేశారు. మంత్రులు, అధికారులు ఎందుకు భయపడుతున్నారు. శాసన సభ్యుల హక్కులను కాలరాస్తున్నారు. స్పీకర్‌కు ప్రివిలేజ్‌ మోషన్‌ ఇస్తాం. అధికారులు కూడా ఒక పార్టీకి తొత్తులుగా పని చేస్తున్నారు. సీఎండీ, సింగరేణి అధికారులకు నోటీసులు ఇస్తా’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు