మీహయాంలో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పండి

12 Jan, 2018 10:42 IST|Sakshi

ఏనాడైనా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు సీఎం అపాయింట్‌మెంట్‌ ఇచ్చాడా..

జన్మభూమి సభలో మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డిపై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి

లక్కిరెడ్డిపల్లె: మీ తండ్రి హయాం నుంచి లక్కిరెడ్డిపల్లెకు మీరు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలంటూ మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డిపై వైఎస్సార్‌ జిల్లా రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.గురువారం మండలంలోని లక్కిరెడ్డిపల్లె జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జన్మభూమి గ్రామ సభలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులపై అభివృద్ధి పేరుతో బురదజల్లే ప్రయత్నం చేశారు. అందుకు ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి  ఘాటుగా స్పందించారు.దీంతో ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డిల మధ్య మాటల యుద్ధం కొనసాగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  వైఎస్సార్‌ హయంలో లక్కిరెడ్డిపల్లె మండలానికి వేల పక్కాగృహాలు మంజూరు చేసిన విషయం మీరు మరిచారా అని ప్రశ్నించారు.నాలుగేళ్లలో మీరెన్ని పక్కాగృహాలు మంజూరు చేశారో ప్రజలకు తెలుసన్నారు. మండలంలో కస్తూర్బా,వెలుగు,ఆదర్శ పాఠశాలలు ఎవరి హయాంలో వచ్చాయో మీకు తెలియదా అన్నారు.

ఎంపీ మిథున్‌రెడ్డి నిధులతో రూ.40 లక్షల మేర బోర్లు వేసి ప్రజలకు దాహార్తి  తీర్చిన విషయాన్ని మీరు గర్తుంచుకోవాలన్నారు. తాను ఎనిమిదిన్నరేళ్లుగా  ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అధికారంలో ఆరు నెలలు మాత్రమే ఉన్నామన్నారు.ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు రావాల్సిన ఏసీడీపీ నిధులను కూడా ఇవ్వలేదని, అవి తీసుకునే అర్హతలు  ముఖ్యమంత్రి మీకు కల్పించినా  ఎంత వరకు అభివృద్ధి చేశారో తెలుపాలని బహిరంగంగా డిమాండ్‌ చేశారు.ఏనాడైనా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు సీఎం అపాయింట్‌మెంట్‌ ఇచ్చాడా అన్ని అడిగారు. పార్టీలకతీతంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభివృద్ధి చేసుకుంటూ పోతుంటే  జన్మభూమి కమిటీల పేరుతో అర్హులకు అన్యాయం చేస్తూ టీడీపీ కార్యకర్తలకు మేలు జరిగేలా చూస్తోంది మీరు కాదా అని అన్నారు.అంతేకాక తమ ఎంపీ నిధుల ద్వారా వస్తున్న లక్షలాది రూపాయల పనులకు పంచాయితీ తీర్మానం ఇవ్వకుండా అడ్డుకుంటోంది మీరు కాదా అని అన్నారు. అభివృద్ధి  విషయంలో సీఎంతోనైనా పోరాడేండుకు సిద్ధంగా ఉన్నానని, మీరు సిద్ధమైతే తేదీని ఖరారు చేయండంటూ సభ సాక్షిగా సవాల్‌ విసిరారు.

సాక్షిపై అక్కసు వెళ్లగక్కిన ఆర్‌ఆర్‌
జన్మభూమి గ్రామసభల్లో గత నాలుగు సంవత్సరాలుగా ఇచ్చిన అర్జీలు పరిష్కారం కాలేదంటూ సాక్షి మీడియా ఎత్తి చూపించడం పట్ల టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌  ఆర్‌ రమేష్‌ కుమార్‌రెడ్డి(ఆర్‌ఆర్‌) అక్కసు వెళ్లగక్కారు. జన్మభూమి గ్రామ సభల పేరుతో అధికారులు ప్రభుత్వ పథకాలు వివరించి చేతులు దులుపుకొని పోతున్న విషయం పాలకులకు తెలిసినా ఒక్క సాక్షి మాత్రం ప్రజల దృష్టికి తీసుకొస్తోందని,  అలాంటి సాక్షిపై టీడీపీ నాయకుడు అక్కసు వెళ్లగక్కడం దారుణమని గ్రామస్తులు పేర్కొంటున్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసి మద్దిరేవుల సుదర్శన్‌ రెడ్డి,ఎంపీపీ రెడ్డెయ్య,ఎంపీటీసి సభ్యులు సైయ్యద్‌ అమీర్, రాజేంద్రారెడ్డి, సర్పంచ్‌ రవి రాజు,తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు