కాంగ్రెస్‌వి శవరాజకీయాలు

31 Jan, 2018 04:08 IST|Sakshi

     టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వీరేశం ధ్వజం

     కోమటిరెడ్డి బ్రదర్స్‌ రౌడీ రాజకీయాలు చేస్తున్నారని మండిపాటు 

     ఓటమి భయంతోనే హత్యా రాజకీయాలతో లబ్ధికి యత్నం 

     నాపై అభాండాలు వేసిన వారిపై కోర్టుకు వెళ్తానని హెచ్చరిక

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కాంగ్రెస్‌ పార్టీ శవ రాజకీయాలకు పాల్పడుతోందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మంగళవారం నల్లగొండలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అతను అత్మీయుడు, మిత్రుడని పేర్కొన్నారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీ నేతలంతా నల్లగొండకు వచ్చి టీఆర్‌ఎస్‌ పార్టీ ఏదో హత్యలు చేస్తున్నట్లు మాట్లాడుతున్నారు.. కానీ జిల్లాలో హత్యలు చేయించింది, రౌడీషీటర్లను పెంచి, పోషించింది ఆ పార్టీయే’’అని ధ్వజమెత్తారు.

కోమటిరెడ్డి బ్రదర్స్‌ రౌడీ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గ్యాంగ్‌స్టర్‌ నయీంతో అంటకాగారని, ఖాసీంఖాన్, యూసుఫ్‌ లాంటి రౌడీషీటర్లను పెంచి పోషించారని ఆరోపించారు. అసలు శ్రీనివాస్‌ హత్యతో తనకు సంబంధం ఏమిటని, హత్యకు గురైన వారు.. నిందితులు టీఆర్‌ఎస్‌ పార్టీవారా అని ప్రశ్నించారు. ఓడిపోతారనుకున్నప్పుడల్లా హత్యా రాజకీయాలను ముందుకు తీసుకొచ్చి పబ్బం గడుపుకోవడం కోమటిరెడ్డి బ్రదర్స్‌కు అలవాటేనని విమర్శించారు. సీఎల్పీ నేత కె.జానారెడ్డి నియోజకవర్గంలో డజన్ల కొద్దీ హత్యలు జరిగాయని ఆయన గుర్తు చేశారు.  డీజీపీని కలసిన కోమటిరెడ్డి.. తనకు బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు, గన్‌మన్లను అదనంగా ఇవ్వమని కోరాడే కానీ శ్రీను కుటుంబానికి రక్షణ కల్పించాలని ఎందుకు కోరలేదని ప్రశ్నించారు.  హైదరాబాద్‌ వెళ్తున్న క్రమంలో శ్రీనివాస్‌ తనకు కాఫీ డే హోటల్‌ వద్ద అనుకోకుండా కలిశాడని, అతనే తన దగ్గరికి వచ్చి పార్టీ మారే విషయమై సలహా ఇవ్వమని అడిగారని వీరేశం పేర్కొన్నారు. తనపై అభాండాలు వేసిన వారిపై కోర్టుకు వెళ్తానని చెప్పారు. 

నా హత్యకు కాంగ్రెస్‌ కుట్ర 
తన హత్యకు కాంగ్రెస్‌ పార్టీ కుట్ర పన్నుతుందని ఎమ్మెల్యే వీరేశం ఆరోపించారు. దీనిపై కోర్టుకు వెళ్తానన్నారు. నల్లగొండలో పీజీ పరీక్ష రాయడానికి వచ్చినప్పుడు చాలా మంది వచ్చి ఫోటోలు దిగారని.. అందులో ఎవరు ఉన్నారో తనకు తెలియదన్నారు.

మరిన్ని వార్తలు