హోదాతోనే మనుగడ

24 Feb, 2018 10:39 IST|Sakshi
ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి

చంద్రబాబు నియంతృత్వ పోకడతోనే నష్టం

ఇన్ని రోజులూ ‘ప్రత్యేక హోదా’ నినాదాన్ని పక్కన పెట్టారు

వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే హోదా పల్లవి

వెనుకబడిన ప్రాంతాలను విస్మరించిన ప్రభుత్వం

అభివృద్ధి అంతా అమరావతికే పరిమితం

హోదా కోసం వైఎస్సార్‌సీపీ నిరంతర పోరు

ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి

అనంతపురం: ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి హైదరాబాద్‌ కేంద్రంగానే సాగింది. ఆ తర్వాత ఏపీ పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకు వైఎస్సార్‌సీపీ నిరంతరం పోరాడుతోంది. ఇదే విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు రెండుసార్లు అసెంబ్లీలో తీర్మానం పెట్టినా ఏకగ్రీవం అయ్యేందుకు తాము కూడా మద్దతిచ్చాం. వరుసగా రెండేళ్లు తీర్మానం చేసిన తర్వాత సీఎం యూటర్న్‌ తీసుకున్నారు. అంతా తానే అన్నట్లు నియంతృత్వ పోకడ కనపరుస్తున్నారు. చంద్రబాబు ఎçప్పుడైతే ప్యాకేజీ విషయంలో రాజీపడ్డారో అప్పటి నుంచి బీజేపీ నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. కేంద్రం, రాష్ట్రం రెండూ దోషులే. కేంద్రం నుంచి నిధులు తెప్పించుకోవడంలో వైఫల్యం చెంది ప్రతిపక్ష పార్టీపై నిందలు వేయడం సరికాదు. ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకోకపోవడం వల్లే ఇంత నష్టం జరిగింది. ఇందుకు ఆయనే బాధ్యత వహించాలి. తన ఫెయిల్యూర్స్‌ను ఇతరులపైకి నెట్టడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. ప్రత్యేకహోదా విషయంలో వైఎస్సార్‌సీపీ పంథా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ద్వంద్వ నీతి.. తదితర అంశాలపై ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డితో ‘సాక్షి’ ఇంటర్వ్యూ.

సాక్షి:  హోదాపై మీ పార్టీ వైఖరేంటి?
విశ్వ:ప్రత్యేక హోదాపై ప్రారంభం నుంచి కూడా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒకే విధానంతో ముందుకు వెళ్తోంది. రాష్ట్ర్‌రం సమైక్యంగా ఉండాలని అందరం కోరుకున్నాం. అయితే విభజన జరిగిపోయింది. అన్యాయంగా విభజిస్తున్నారని గొంతెత్తాం. రాజధాని లేకుండానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ప్రత్యేకహోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తమ అధినేత ఆది నుంచీ చెబుతున్నారు.

సాక్షి: రాష్ట్ర ప్రభుత్వం తప్పంతా కేంద్రంపై నెడుతోందంటారా?
విశ్వ:  ప్రత్యేక హోదా విషయంలో ప్రజలకు చంద్రబాబు ద్రోహం చేశారు. ఆయన వ్యవహారంపై రాష్ట్ర ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత వచ్చింది. బంద్‌లు, ఆందోళనలు ఊహించని రీతిలో సక్సెస్‌ కావడమే అందుకు నిదర్శనం. కేంద్రంపై ఒత్తిడి పెంచాల్సిన ముఖ్యమంత్రి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్యాకేజీకి అంగీకరించకుండా.. మెతకవైకరి ప్రదర్శించకుండా ఉంటే ఈ రోజు బీజేపీ ప్రభుత్వం తప్పకుండా తలొగ్గేది.

సాక్షి:  ప్రత్యేక హోదా వల్ల ఒరిగిందేమీ లేదన్న చంద్రబాబే ఈ రోజు హోదా అవసరమనే సంకేతాలు లీకుల ద్వారా ఇవ్వడాన్ని మీరెలా సమర్థిస్తారు?
విశ్వ: గతంలో హోదా కలిగిన 9 ఈశాన్య రాష్ట్రాల్లో మళ్లీ పొడిగించారు. హోదా విలువ తెలిసే ఈశాన్య రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మళ్లీ పొడిగించుకున్నాయి. మన ముఖ్యమంత్రి మాత్రం ఇది ముగిసిన అధ్యాయం అని చెబుతూవచ్చారు. ఇప్పుడు ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో దాన్ని తగ్గించుకునే క్రమంలోనే హోదా పల్లవి అందుకుంటున్నారు.

సాక్షి:   కేంద్రం కూడా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందంటారా?
విశ్వ:నిధులు ఇచ్చేటప్పుడు కేంద్రం కూడా తన రాజకీయ ప్రయోజనాలు చూస్తుంది. తాను అధికారంలో ఉన్న రాష్ట్రాలకు రైల్వే నిధులు కాని, ప్యాకేజీ విషయంలో ఉదారంగా వ్యవహరిస్తోంది. మన రాష్ట్రంలో పెద్ద ఉపయోగం లేదు కాబట్టి సహజంగానే తెలుగు రాష్ట్రాల పట్ల కేంద్రం నిర్లక్ష్యం చూపుతోంది. అలాంటప్పుడు కేంద్రం ఉదారంగా ఇస్తుందని ఆశించలేం. ఒత్తిడి పెంచితే ఏదైనా లాభం ఉంటుంది. తమ అధినేత జగన్‌ అనేకమార్లు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీకి అఖిలపక్షం తీసుకెళ్లండి సపోర్ట్‌ చేస్తామని చెప్పినా ముఖ్యమంత్రి పట్టించుకోలేదు.

సాక్షి:   చంద్రబాబు కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నించకపోవడం వెనుక ఉద్దేశమేమనుకుంటారు?
విశ్వ: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే సమయంలో పట్టుబడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా లొంగుబాటును ప్రదర్శించారు. పదేళ్లు హైదరాబాద్‌లో ఉండడానికి అవకాశం ఉన్నా రాత్రికిరాత్రే విజయవాడకు వచ్చేశారు. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు కూడా ఓటుకు నోటు కేసు భయంతో 85 రోజులు సెక్రటేరియేట్‌కు వెళ్లలేదు. బహుశా ఇన్ని రోజులు సెక్రటేరియేట్‌కు వెళ్లని ముఖ్యమంత్రి ఎక్కడా ఉండరేమో.

సాక్షి: ప్రత్యేక హోదా విషయంలో అన్ని పార్టీలను కలుపుకుని వెళ్తామని చెబుతున్న పవన్‌కళ్యాణ్‌ వ్యాఖ్యల పట్ల మీ స్పందనేంటి?
విశ్వ: పవన్‌కళ్యాణ్‌ గురించి ఈ మూడేళ్లలో చూశాం. ఆయన కష్టపడే మనిషికాదు. ఇతరులపై ఆధారపడి రాజకీయాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు చంద్రబాబు డైరెక్షన్‌లో రాజకీయం చేస్తున్నారు. ఈ విషయం అనేక సందర్భాల్లో నిరూపితమైంది. అనేక ఉద్యమాలు నీరుగార్చుతూ చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించారు.

సాక్షి: జిల్లాకు వచ్చిన పవన్‌ కొందర్నే కలవడాన్ని ఏమనుకుంటారు?
విశ్వ:ఇక్కడ తీవ్రమైన కరువు ఉంది. అధికారంలో ఉన్న వారి ఇళ్లకు పోవడం వెనుక ఆంతర్యం ఆయనకే తెలియాలి. జిల్లా కరువుపై పోరాటాలు చేసిన అనేక పార్టీలు ఉన్నాయి. స్వతంత్ర సంస్థలు, కవులు, రచయితలు ఉన్నారు. అయితే కేవలం అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలనే కలిశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది పోయి మద్ధతుగా నిలవడాన్ని ఆయన అభిమానులు కూడా తట్టులేకపోతున్నారు. 

సాక్షి:   సీమ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుందా?
విశ్వ: అన్ని రకాలుగా వెనుకబడిన రాయలసీమతో పాటు ఉత్తరాంధ్రలోని ఏడు జిల్లాల అభివృద్ధికి స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ప్యాకేజీ ఇవ్వాలని విభజన సమయంలో హామీ ఇచ్చారు. ఒక్కో జిల్లాకు రూ.50 కోట్లు కూడా ఇవ్వలేదు. ఈ బడ్జెట్‌లో ఆయా ప్రాంతాల విషయాలనే మరిచిపోయారు.

సాక్షి:  కొత్త రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని ఇచ్చిన హామీ అమలవుతోందా?
విశ్వ: రాష్ట్రం విడిపోవడానికి ప్రధాన కారణం అభివృద్ధి కేంద్రీకరించడమే. తెలంగాణ కంటే రాయలసీమ జిల్లాలు పూర్తిగా వెనుకబడి ఉన్నాయంటూ స్వయంగా శ్రీకృష్ణ కమిటీ నివేదిక కూడా ఇచ్చింది. వేలాది మంది నుంచి వినతులు స్వీకరించి, స్వయంగా పరిశీలించిన శివరామకృష్ణన్‌ కమిటీ కూడా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని స్పష్టం చేసింది. కానీ చంద్రబాబు ఎవరి మాటా వినకుండా అభివృద్ధిని అమరావతికే పరిమితం చేస్తున్నారు.

సాక్షి:  సీమ ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు చేయాలని జరుగున్న ఉద్యమంపై మీ స్పందన?
విశ్వ: చంద్రబాబు పాఠం నేర్చుకోవాలి. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని చేస్తున్న డిమాండ్‌ చాలా న్యాయమైనది. దీనిపై సీఎంతో చర్చించడానికి అమరావతికి లాయర్లు వెళితే కలవడానికి కూడా నిరాకరించడం బాధాకరం. న్యాయవాదుల ఉద్యమానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది.

సాక్షి:  హోదాకు ప్రత్యేక ప్యాకేజీ సమానమేనా?
విశ్వ: అసలు కానేకాదు. ప్రత్యేక హోదా లేకపోతే పరిశ్రమలు, కేంద్రం నుంచి వచ్చే నిధులు, వివిధ పన్నుల రూపంలో ఏటా రూ.60 వేల కోట్ల ఆదాయం నష్టపోతాం. ఈ ఏడాది ప్యాకేజీ కింద చంద్రబాబు అడిగింది రూ.3,900 కోట్లు. అందుకే హోదాకు, ప్యాకేజీకి ఎలాంటి సంబంధం లేదు. ప్యాకేజీ అంటే ఏదో కొంత నిధులు వస్తాయి. అదే హోదా ఇన్తే అనేక రాయితీలు వర్తిస్తాయి. తద్వారా పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. 11 అనుభవ రాష్ట్రాల్లో ఇది నిరూపితమైంది.

సాక్షి: రాష్ట్రాభివృద్ధికే విదేశీ పర్యటనలు చేస్తున్నానని సీఎం చెబుతున్నారు?
విశ్వ: ప్రత్యేక హోదా రాకుండా ఎన్నిమార్లు విదేశీ పర్యటనలు చేసినా ఫలితం శూన్యం. రాష్ట్ర విభజన తర్వాత చాలా తీవ్రమైన సమస్యతో ప్రజలు అల్లాడుతున్నారు. ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకోవడం లేదు. కీలకమైన రాజధాని నిర్మాణం, నదీజలాలు, తెలుగు రాష్ట్రాల మధ్య వచ్చిన సమస్య, విభజన హామీల అమలుకు కేంద్రంపై ఒత్తిడి తేవడంలోనూ సీఎం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయలేదు. చివరికి అసెంబ్లీ కూడా నడపలేని స్థితికి సీఎం చేరుకున్నారు.

మరిన్ని వార్తలు