పంటలకు మద్దతు ధర ప్రకటించాలి

23 Jun, 2018 08:00 IST|Sakshi
మాట్లాడుతున్న ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, చిత్రంలో అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, ఆలూరి సాంబశివారెడ్డి, రాజారాం, చింతా సోమశేఖర్‌రెడ్డి

అనంతపురం: ‘‘పంటకు మద్దతు ధర లేక రైతులు గగ్గోలు పెడుతున్నారు. వేరుశనగ, పప్పుశనగ తదితర పంటలన్నీ ఇళ్లలోనే మగ్గిపోతున్నాయి. విత్తనం వేసే సమయం వచ్చినా.. పంట అమ్ముకునే పరిస్థితి లేదు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుకు అనుగుణంగా ధరలు అమలు చేస్తున్నామంటూ ప్రభుత్వం మభ్య పెడుతోంది’’ అని ఉరవకొండ ఎమ్మెల్యే యల్లారెడ్డిగారి విశ్వేశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అన్ని పంటలకు సాగు వ్యయం రెట్టింపైనా... కనీస మద్దతు ధర మాత్రం 10 శాతానికి మించి పెంచలేదన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని ప్రకటించినా..ఒక్క ఏడాది కూడా రూ.100 కోట్లు కేటాయించలేదన్నారు. రైతుల నుంచి పంట కొనుగోలు చేసిన 48 గంటల్లో డబ్బు జమ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం... నేటికీ చాలామంది రైతులకు ఇంకా చెల్లించలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 లక్షల టన్నుల వేరుశనగ కొనుగోలు చేస్తామని చెప్పి... 3 లక్షల టన్నులు కూడా కొనుగోలు చేయలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నాయి. విలేకరుల సమావేశంలో పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బోయ నరేంద్రబాబు(రాజారాం), పార్టీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

పెట్టుబడులు కూడా తిరిగిరాని పరిస్థితి  
కరువు జిల్లా. ప్రతి నాలుగేళ్లలో మూడేళ్లు పెట్టుబడులు కూడా తిరిగి రాని పరిస్థితి. వేరుశనగ పంట సాగు చేసిన రైతులు సర్వస్వం కోల్పోయారు. స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం గతేడాది ఎకరాకు రూ.21 వేలు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈసారి మరింత పెరిగింది. గత ఖరీఫ్‌లో వేరుశనగ సాగు చేసిన రైతులు రూ. 10–12 వేలు నష్టపోయారు. వ్యాపారుల ముసుగులో టీడీపీ నేతలు క్వింటాలుకు రూ. 3,600 చొప్పున రైతుల నుంచి కొనుగోలు చేసి, ప్రభుత్వానికి రూ. 5,500 విక్రయించి సొమ్ము చేసుకున్నారు.– అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎంపీ

మోసకారి మాటలు  
ప్రభుత్వం మోసగారి మాటలతో కాలం వెల్లదీస్తోంది. కరువుతో పంటలు పండక రైతులు, కూలీలు వలసలు వెళ్తే ఎక్కువ డబ్బులు వస్తాయనే ఆశతో వెళ్లారంటూ స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పడం సిగ్గుచేటు. దీన్నిబట్టి చూస్తే వారికి రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో తెలుస్తోంది. పంటలకు గిట్టుబాటు ధర లేక  రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులకు అవినీతి, అక్రమాలపై ఉన్న ధ్యాస... ప్రజల సంక్షేమంపై లేదు. మహరాష్ట్రలో రైతుల స్ఫూర్తితో ఇక్కడా ఉద్యమాలు చేయాల్సి ఉంది.– వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ

మరిన్ని వార్తలు