'పద్మవ్యూహాన్ని ఎలా ఛేదించాలో వైఎస్ జగన్‌కు తెలుసు'

10 Dec, 2017 17:38 IST|Sakshi

సాక్షి, ఉరవకొండ: టీడీపీ నేతలు సృష్టించే పద్మవ్యూహాన్ని ఎలా ఛేదించాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలుసునని ఆ పార్టీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు వైఖరి గాడిద, ఒంటె సామెతలా ఉందని ఎద్దేవా చేశారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కూడేరులో నిర్వహించిన బహిరంగసభలో ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ప్రసంగించారు. టీడీపీ నేతలకు సవాల్ విసురుతున్నా.. మీరు ఏ విషయంలో వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చర్చకు వస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇరిగేషన్, ఎడ్యూకేషన్, ఇలా ఏ శాఖ తీసుకున్నా వైఎస్ జగన్‌తో చర్చలో పాల్గొనే సత్తా మీకుందా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ అసెంబ్లీలో అడుగు పెడితే టీడీపీ శ్రేణుల్లో వణుకు పుడుతుందన్నారు.

'గాడిద ఎలా పాట పాడుతుందో తెలుసా.. ఓండ్రు పెడుతుంది. అలాంటి గాడిద పాట విని ఒంటే తన్మయత్వంతో డ్యాన్స్ చేసిందట.. అలా ఉంది చంద్రబాబు తీరు, పరిపాలన. నాలుగేళ్లలో ఏపీలో జరిగింది అసమర్థ పాలన. నియోజకవర్గానికి నీళ్లు కూడా తీసుకురాలేని అసమర్థుడు పయ్యావుల కేశవ్. అలాంటి అసమర్థ నేత కేశవ్ నాపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది. పయ్యావుల దౌర్జన్యాలకు ఎవరూ భపడొద్దు. మీకు అండగా మేం ఉంటాం. చంద్రబాబు, పయ్యావుల కేశవ్ వల్లే కూడేరుకు నీళ్లు రావడం లేదు. నీళ్ల కోసం ధర్నాలు చేస్తే నన్ను అరెస్ట్ చేయించారు. కేశవ్ ఇంట్లో అంట్లు తోమడానికి అధికారులున్నారా. ఉరవకొండ ప్రాంతాన్ని సుభిక్షం చేయాలని వేల ఎకరాలకు నీళ్లివ్వాలని దివంగత సీఎం రాజశేఖరరెడ్డి హంద్రీ నీవా జలాలను అందించగా, ప్రస్తుత సీఎం చంద్రబాబు ఏం చేశాడని ప్రశ్నిస్తున్నాను.

నియోజవర్గానికి నీళ్ల కోసం ఎన్నోసార్లు ధర్నాలు చేశాం. వీధుల వెంబడి అరెస్టులు చేసినా భరించాం. అత్యల్ప వర్షపాతం కురిసే మండలం మాది. కేవలం 250 మి.మీ వర్షం కురిసే ప్రాంతాన్ని చంద్రబాబు పట్టించుకోలేదు. తాగడానికి నీళ్లులేక అలమటిస్తుంటే చంద్రబాబు సర్కార్ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇళ్లిళ్లు తిరుగుతా.. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను కలుస్తాను. వారి సమస్యలు అడిగి తెలుసుకుంటాను. మరో ఏడాది ఆగితే వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వస్తుందని, ప్రజల ప్రభుత్వంలో రైతుల సమస్యలను వైఎస్ జగన్ తీరుస్తారని' ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి హామీ ఇచ్చారు.

వైఎస్ జగన్ అసెంబ్లీకి వస్తే టీడీపీకి వణుకు 

మరిన్ని వార్తలు