పేదలు ఇప్పుడు గుర్తొచ్చారా? 

10 Feb, 2019 08:36 IST|Sakshi
ఇంటిపట్టాల పంపిణీ సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి

ఎన్నికల వేళ మభ్య పెట్టడానికే ఇంటిపట్టాల పంపిణీ 

ఎమ్మెల్సీ కేశవ్‌పై  ధ్వజమెత్తిన ఎమ్మెల్యే విశ్వ

ఉరవకొండ: తెలుగుదేశం అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్ల తర్వాత పేదలు గుర్తొచ్చారా అంటూ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ను ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి నిలదీశారు. మరో ఇరవై రోజుల్లో ఎన్నికల కోడ్‌ వస్తున్న నేపథ్యంలో ఇంటి పట్టాల పంపిణీ చేపట్టడం పేదలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవడానికేనని ధ్వజమెత్తారు. ఉరవకొండలోని ఎస్‌కే ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో శనివారం చేపట్టిన ఇంటిపట్టాల పంపిణీ ఉద్రిక్తతల నడుమ సాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పేదల ఇంటి పట్టాల సాధన కోసం తాను సాగించిన పోరాటాలను, టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. పట్టణంలో ఇంటింటికీ వెళ్లి సమస్యలను గతంలో గుర్తించామన్నారు.

ఇందులో నివేశన స్థలం, పక్కాగృహాలు లేవని ఎంతోమంది పేదలు తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. సంప్‌లు శుభ్రం చేయకపోవడంతో అపరిశుభ్రంగా సరఫరా అవుతున్న నీటినే తాగాల్సిన దుస్థితి గురించి వివరించారన్నారు. 2014 నుంచి పేదల ఇంటి పట్టాల కోసం తాను సుదీర్ఘ పోరాటాలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. వైఎస్సార్‌సీపీతో పాటు సీపీఐ, సీపీఎం కుడా పోరాటాల్లో పాలుపంచుకున్నారన్నారు. 2016లో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు 25 గంటల దీక్ష, ఆ ఏడాది జూలై 29న తహసీల్దార్‌ కార్యాలయం ముట్టడితో పాటు వేలాది మందితో రోడ్డు దిగ్బంధించి చంద్రబాబు ప్రభుత్వానికి కనువిప్పు కల్గించామన్నారు. 2017 ఫిబ్రవరి 6న ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా ఉరవకొండలో నిర్వహించిన ధర్నాలో పేదలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారన్నారు. నాలుగున్నరేళ్లుగా పేదలకు పట్టాలు ఇవ్వకుండా ఎన్నికల సమయం దగ్గర పడుతుందని తెలిసి, ఇప్పడు పట్టాలు ఇవ్వకపోతే తమను ప్రజలు ఎక్కడి అక్కడ నిలదీస్తారోనని భయపడి పట్టాల పంపిణీకి ఎమ్మెల్సీ కేశవ్‌ శ్రీకారం చుట్టారని ధ్వజమెత్తారు.

ఎమ్మెల్యే ప్రసంగానికి అడుగడుగునా అడ్డంకులు 
ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి టీడీపీ ప్రభుత్వ తీరు, ఎమ్మెల్సీ కేశవ్‌ల తీరును ఎండగడుతుండటంతో జీర్ణించుకోలేని టీడీపీ నేతలు ఎమ్మెల్యే మాట్లాడుతున్న మైక్‌ను కట్‌ చేశారు. ఎమ్మెల్యే మహనేత వైఎస్, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేరు ఉచ్ఛరించగానే సభలో తప్పట్లు, ఈలలు వేయడం వేదికపై ఉన్న టీడీపీ నేతలకు మరింత కోపాన్ని తెప్పించింది. దీంతో వాస్తవాలు చెబుతున్న ఎమ్మెల్యే మైకును లాక్కోవడంతో టీడీపీ, వైఎస్సార్‌సీపీ శ్రేణుల మధ్య మాటల యుద్ధం జరిగింది.

దీంతో పాటు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు చందా చంద్రమ్మ, సులోచనలు మాట్లాడుతుండగా టీడీపీ నాయకులు కొందరు సభ్యత లేకుండా అడ్డుతగిలారు. దీంతో గుంతకల్లు డీఎస్పీ ఖాసీంసాబ్, సీఐ సయ్యద్‌ చిన్నగౌస్, ఎస్‌లు ఇరువర్గాల వారినీ సముదాయించారు. అనంతరం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ విప్‌ చేతుల మిదుగా పేదలకు పట్టాలు అందించారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డు ఛైర్మన్‌ రేగాటి నాగరాజు, ఎంపీపీ సుంకమ్మ, తహసీల్దార్‌ శ్రీనివాసులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు