అప్పట్లో ఎమ్మెల్యే పదవి ఏడేళ్లు

25 Mar, 2019 08:36 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో 1957లో జరిగిన సాధారణ ఎన్నికలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు తెలంగాణలో మాత్రమే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. 1953 అక్టోబర్‌ 1న ఆంధ్ర, రాయలసీమ జిల్లాలు కలిసి ఆంధ్రరాష్ట్రంగా ఏర్పడ్డాయి. టంగుటూరి ప్రకాశం పంతులు తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆయన స్వల్పకాలంలోనే పదవీచ్యుతులు కాగా.. రాష్ట్రపతి పాలన అనంతరం 1955 మార్చిలో 196 అసెంబ్లీ నియోజకవర్గాలకు మధ్యంతర ఎన్నికలు జరిగాయి. బెజవాడ గోపాలరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.

1956లో ఆంధ్ర, తెలంగాణ కలిసి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడ్డాయి. నీలం సంజీవరెడ్డి మొదటి సీఎం అయ్యారు. 1957లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. ఆంధ్రప్రాంతంలోని 196 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అప్పటికే మధ్యంతర ఎన్నికలు జరిగినందున తెలంగాణలోని 104 అసెంబ్లీ నియోజకవర్గాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించారు. దీంతో ఆంధ్ర, రాయలసీమకు చెందిన 196 మంది ఎమ్మెల్యేలు 1962 వరకూ ఏడేళ్లు ఎమ్మెల్యేలుగా కొనసాగారు.    

మరిన్ని వార్తలు