'తాను, కొడుకు బాగుంటే చాలు.. ఇంకేం అవసరం లేదు'

11 Feb, 2020 16:57 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర సమగ్రాభివృద్ధి వికేంద్రీకరణతోనే సాధ్యమని, అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భావిస్తున్నారని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. విశాఖ అశీలమెట్ట వద్ద వేమన మందిరంలో  మంగళవారం  అభివృద్ది, పరిపాలనా వికేంద్రీకరణకు మద్దతుగా ఉత్తరాంధ్ర బిసి కుల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ..  చంద్రబాబు సుధీర్ఘకాలంగా సిఎంగా చేసినా ఇంతటి మంచి ఆలోచన చేయలేదని, శివరామకృష్ణ కమిటీ, శ్రీకృష్ణ కమిటీ నివేదికలను చంద్రబాబు పట్టించుకోలేదని దుయ్యబట్టారు.  అమరావతి రాజధానిగా సానుకూలం కాదని నివేదికలు చెప్పినా చంద్రబాబు వినలేదన్నారు.  పచ్చనిపంట భూములను రాజధాని పేరుతో బలవంతంగా సేకరించి రూ. 94 వేల కోట్ల నుంచి రూ. 3 లక్షల కోట్లకు రాష్ట్ర అప్పులను పెంచారని ఎద్దేవా చేశారు.  తాను, తన కొడుకు లోకేష్, తన వర్గం బాగుంటే చాలన్నట్లు చంద్రబాబు భావిస్తున్నారని వెల్లడించారు. ప్రభుత్వానికి అభివృద్ది, సంక్షేమం అనేవి  రెండు కళ్లలాంటివని కృష్ణమూర్తి పేర్కొన్నారు.(‘చంద్రబాబు రాజకీయ వ్యభిచారి’)

విశాఖలో పరిపాలనా రాజధానితో ఉత్తరాంధ్రకు మేలు జరుగుతుందని తెలిపారు. మండలిలో రాజ్యాంగ విరుద్దంగా  వ్యవహరించిన టీడీపీ వికేంద్రీకరణ బిల్లును అడ్డుకుందని దుయ్యబట్టారు. టీడిపి సూచనలతో సెలెక్ట్ కమిటీ వేయడం కుదరదని,  శాసన సభతో సంబంధం లేకుండా సబ్ కమిటీ వేయడం సాధ్యంకాదని ఆయన తేల్చి చెప్పారు. విశాఖ పరిపాలనా రాజధాని కావడం వల్ల బలహీన వర్గాలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కృష్ణమూర్తి వెల్లడించారు.ఈ కార్యక్రమానికి గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, వైఎస్సార్ సిపి ఉత్తరాంధ్ర జిల్లాల బిసి విభాగం అధ్యక్షుడు ఫక్కి దివాకర్, సిటీ అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్‌ యాదవ్, బీసీ నేతలు కోలా గురువులు, రామన్నపాత్రుడు, రొంగలి జగన్నాధం, సత్యాల సాగరిక,  పీలా వెంకటలక్ష్మి, యువశ్రీ, బొడ్డేటి గంగామహేష్ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు