'కంటివెలుగు పథకం నిర్వీర్యంగా మారింది'

12 Mar, 2020 16:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో కంటివెలుగు పథకం నిర్వీర్యంగా మారిందని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ టీ. జీవన్‌రెడ్డి శాసనమండలిలో ఆవేదన వ్యక్తం చేశారు. కంటివెలుగు పథకం కింద కంటి ఆపరేషన్లు ఎవరికి చేయడం లేదని, ఆరోగ్య శ్రీ రోగుల పట్ల కార్పొరేట్‌ ఆసుపత్రులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌ భారత్‌ను అమలు చేస్తే ఆరోగ్య శ్రీని నిలిపివేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఆయుష్మాన్‌ భారత్‌తో పాటు ఆరోగ్య శ్రీని కూడా కంటిన్యూ చేయాలన్నారు. కాగా బడ్జెట్‌లో విద్య కోసం రూ.14728 కోట్లు కేటాయించారని, అయితే విద్యపై ప్రభుత్వం మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. (‘అప్పుడు కరెంట్‌ బందు.. ఇప్పుడు రైతు బంధు’)

బుధవారం అసెంబ్లీ ముట్టడికి యత్నించిన విద్యార్థుల పట్ల పోలీసులు నియంతృత్వంగా వ్యవహరించడం దారుణంగా అభివర్ణించారు. రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్‌ ఊసే లేదని, గ్రూఫ్స్‌ నోటిఫికేషన్‌ ఇప్పటికి ఇవ్వలేదన్నారు. యునివర్సిటీల్లోనూ పోస్టులు చాలా వరకు ఖాళీగానే ఉన్నాయి. ప్రభుత్వం చొరవ తీసుకొని నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని పేర్కొన్నారు.  ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్‌ అమలు కావడం లేదన్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రాష్ట్రంలో ఎలాంటి కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వలేదని తెలిపారు. రేషన్‌షాపుల్లో ఇవ్వాల్సిన తొమ్మిది రకాల సరుకులు ఏమయ్యాయని ప్రశ్నించారు. పండుగ పూట ఇవ్వాల్సిన చక్కెర, గోధుమలు, కిరోసిన్‌ లాంటివి ఇవ్వకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని వెల్లడించారు. రుణమాఫీలో భాగంగా రూ. 50వేల వరకు ఉన్న రైతులకు ఒకసారి, 50 వేలకు పైగా ఉన్న రైతులకు రెండు విడతల్లో రుణమాఫీ చేస్తే బాగుంటుందని జీవన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు