రైతుల కష్టాలకు కాంగ్రెస్సే కారణం

21 Oct, 2017 03:07 IST|Sakshi

కాంగ్రెస్‌ నేతలపై మండిపడిన ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ నేతల తీరు మొగుణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కినట్టుందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ ఎద్దేవా చేశారు. వారు పదేపదే ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు చూస్తుంటే.. చేయాల్సిం దంతా చేసి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నట్లుగా ఉందన్నారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు 42 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనే కారణమన్నారు. వారి హయాంలో రైతు దగా పడ్డాడని, రైతును ఆదుకునేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుంటే అడ్డుపుల్లలు వేసే పనిలో వారు తీరికలేకుండా ఉన్నారని విమర్శించారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి రైతులకు క్షమాపణ చెప్పి, లెంపలు వేసుకుని చలో అసెంబ్లీ నిర్వహించాలన్నారు. కోమటిరెడ్డి, జీవన్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి రైతు సమస్యల మీద మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. జైపాల్‌రెడ్డి కల్వకుర్తి ప్రాజెక్టుపై అబద్ధాలను ప్రచారం చేస్తున్నారన్నారు.  90శాతం పనులు పూర్తి చేశామంటున్నారని, మరి మిగిలిన 10శాతం పనులు పూర్తిచేయక పోవడానికి కారణం ఏమి టని నిలదీశారు.  కనీస మద్దతు ధర వచ్చేంతవరకు పత్తి రైతులు తమ పంటలను అమ్ముకోవద్దన్నారు. ఓవైపు కోర్టుల్లో కేసులు వేస్తున్న కాంగ్రెస్‌ నేతలు మరోవైపు సాగునీటి ప్రాజెక్టుల్లో జాప్యాన్ని ప్రశ్నిస్తున్నారని దుయ్యబట్టారు. రైతులపై నిజంగానే వారికి ప్రేమ ఉంటే సాగునీటి ప్రాజెక్టులపై వేసిన కేసుల ను ఉపసంహరించుకోవాలన్నారు.

మరిన్ని వార్తలు