ప్రధాన దోషి చంద్రబాబే

2 Feb, 2019 05:25 IST|Sakshi

మండలిలో బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ నిలదీత

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి హోదా రాకపోవడానికి ప్రధాన దోషి ముఖ్యమంత్రి చంద్రబాబేనని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ తప్పుబట్టారు. ప్రత్యేక హోదా వద్దంటూ.. ప్యాకేజీ అడిగింది చంద్రబాబు కాదా? అని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం అమలుపై మండలిలో శుక్రవారం జరిగిన స్వల్పకాలిక చర్చలో బీజేపీ, టీడీపీ సభ్యులు పోటాపోటీ విమర్శలు చేసుకోవడంతో ఘర్షణ పూరిత వాతావరణం కొనసాగింది. రాష్ట్రానికి హోదా, నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని ఆరోపిస్తూ టీడీపీ సభ్యులు చర్చను ప్రారంభించారు. చర్చలో మాధవ్‌ మాట్లాడుతూ.. హోదా పదిహేనేళ్లు కావాలని అడిగిన చంద్రబాబు మరి ప్యాకేజీ ఎందుకు అడిగారని ప్రశ్నించారు. అదే సమయంలో టీడీపీ సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి మాధవ్‌ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో బీజేపీ ఎమ్మెల్సీలు మాధవ్, వీర్రాజులు కూడా వెల్‌లోకి దూసుకెళ్లారు.

ఒక దశలో టీడీపీ ఎమ్మెల్సీలు మంతెన సత్యనారాయణరాజు(పాందువ్వ శ్రీను), బీదా రవిచంద్రలు వీర్రాజు, మాధవ్‌లపై కలబడే ప్రయత్నం చేశారు. దీంతో రాము సూర్యారావు, పయ్యావుల కేశవ్, బుద్దా వెంకన్నలు జోక్యం చేసుకుని సర్ధిచెప్పారు. పరిస్థితి అదుపు తప్పడంతో ఇన్‌చార్జి చైర్మన్‌ రెడ్డి సుబ్రమణ్యం స్పందిస్తూ సభ్యులు సభా సంప్రదాయాలు పాటించాలని సూచించారు. అనంతరం మాధవ్‌ ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. లోటు బడ్జెట్‌ భర్తీకి కేంద్రం నిధులు ఇచ్చిందని, రాజధాని చుట్టూ జరిగిన అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులపై లెక్కలతో సహా బయటపెడతామన్నారు. మాధవ్‌ ప్రసంగిస్తుండగా.. మంత్రులు యనమల రామకృష్ణుడు, ఎన్‌ఎండీ ఫరూక్, సభ్యులు డొక్కా మాణిక్యవరప్రసాద్, పయ్యావుల కేశవ్‌ తదితరులు అడ్డుతగలడంతో ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మీ తీరు వల్లే ప్రధాన ప్రతిపక్షాన్ని సభలో లేకుండా చేశారని, మా ఇద్దర్ని కూడా ఉండనివ్వరా? అని ప్రశ్నించారు. చంద్రబాబును మట్టి పిసుక్కోమని ప్రధాని మోదీ కుండలో మట్టి, నీళ్లు తెచ్చి ఇచ్చారని, పాపులు తిరిగే పార్లమెంటులో మట్టి, కలుషితమైన గంగానది నీళ్లు తెచ్చారంటూ టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

బీజేపీ వాకౌట్‌.. తీర్మాన ప్రతుల చించివేత
ప్రత్యేక హోదా, విభజన చట్టం అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందని ఆరోపిస్తూ శాసనమండలిలో ప్రభుత్వం చేసిన తీర్మానం ప్రతులను బీజేపీ ఎమ్మెల్సీలు చించి సభ నుంచి వాకౌట్‌ చేశారు. 

పోలవరం వైఎస్‌ ప్రారంభించారు.. బాబుకు మాట్లాడే హక్కులేదు
పోలవరం ప్రాజెక్టు పనుల్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించి కాల్వలు తవ్విస్తే, దానికి నాలుగు గొట్టాలు పెట్టి ఆ ప్రాజెక్టును తానే చేపట్టానని సీఎం చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని బీజేపీ ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, పీవీఎన్‌ మాధవ్‌లు ఎద్దేవా చేశారు. గతంలో అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లలో ఎప్పుడూ పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ప్రస్తావించలేదని శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద వారు విమర్శించారు. కేంద్రం నిధులు విడుదల చేస్తుంటే వాటితో లోపభూయిష్టంగా పనులు చేయిస్తూ రూ.కోట్ల నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. రూ.1100 కోట్ల విలువైన స్పిల్‌ వే పనుల విలువను రూ.1400 కోట్లకు పెంచేసి టెండర్లు పిలిచారని ఆరోపించారు. రైతులకు ఎకరాకు రూ.29 లక్షలు నష్టపరిహారంగా చెల్లించాల్సి ఉంటే రూ.59 లక్షలు చెల్లించారన్నారు. ఈ ప్రాజెక్టు ప్రతీ టెండరులో నిర్మాణ సంస్థలతో చంద్రబాబు కుమ్మక్కై నిధులు స్వాహా చేశారని చెప్పారు. ప్రాజెక్టుపై అవసరమైన వివరాలు ఇచ్చేందుకు తాము సిద్ధమని, ముఖ్యమంత్రి సిద్ధమా? అని సవాల్‌ విసిరారు. ఉపాధి హామీ పనులు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయని, రూ.16 వేల కోట్ల  మట్టి పనుల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందన్నారు. 

>
మరిన్ని వార్తలు