ఎమ్మెల్సీ నోటిఫికేషన్‌

26 Feb, 2019 06:46 IST|Sakshi
ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోమవారం నామినేషన్‌ దాఖలు చేస్తున్న హోంమంత్రిమహమూద్‌ అలీ, చిత్రంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్,ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్‌

హైదరాబాద్‌ స్థానిక సంస్థల నియోజకవర్గానికి ప్రకటన

మార్చి 5 వరకు నామినేషన్లు  

6న పరిశీలన 8 వరకు ఉపసంహరణ గడువు

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైంది. నామినేషన్ల దాఖలుకు మార్చి 5 వరకు అవకాశముంది. 6న నామినేషన్ల పరిశీలన ఉండగా,  8న మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుంది. ప్రభుత్వ సెలవు దినాలు మినహా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3గంటల లోపు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా నియమితులైన జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ కమిషనర్‌ (రెవెన్యూ, ప్రకటనలు, ట్రేడ్‌ లైసెన్సు)కు గానీ, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్‌గా నియమితులైన అడిషనల్‌  కమిషనర్‌(ఎన్నికలు)కు గానీ నామినేషన్‌ పత్రాలు అందజేయొచ్చు. అర్హతలతో కూడిన నామినేషన్‌ ఒక్కటే దాఖలైతే పోలింగ్‌ అవసరం ఉండదు.

ఒకవేళ ఎన్నిక నిర్వహించాల్సి వస్తే మార్చి 22న ఉదయం 8 నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్‌ ఉంటుందని రిటర్నింగ్‌ అధికారి అద్వైత్‌కుమార్‌సింగ్‌ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంఎస్‌ ప్రభాకర్‌రావు పదవీ కాలం మే 1న ముగియనుండడంతో ఎన్నిక నిర్వహిస్తున్నారు. పోలింగ్‌ నిర్వహించే పక్షంలో హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని 84మంది కార్పొరేటర్లు, 15 మంది ఎమ్మెల్యేలతో పాటు ఎక్స్‌ అఫిషియో సభ్యులైన ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా ఓటు వేసేందుకు అర్హులని జీహెచ్‌ఎంసీ వర్గాలు పేర్కొన్నాయి. ఎంఎస్‌  ప్రభాకర్‌రావు కాంగ్రెస్‌ తరఫున రెండు పర్యాయాలు ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.    ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఉన్న ఆయన మరోసారి తనకు అవకాశం కల్పించాలని అధిష్టానాన్ని కోరారు. తిరిగి టికెట్‌ లభిస్తే హైదరాబాద్‌ స్థానిక నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్‌ కొట్టనున్నారు. 

మరిన్ని వార్తలు