‘రాముడు తెలంగాణలో.. ఆస్తులు ఆంధ్రాలో’

14 Jun, 2018 16:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘భద్రాచల రాముడు తెలంగాణలో కొలువై ఉంటే, ఆయన ఆస్తులు మాత్రం ఆంధ్రలో ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం రాముడి ఆస్తులున్న గ్రామాలను తెలంగాణకు ఇవ్వడానికి సుముఖంగా ఉంది. కేసీఆర్‌ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేద’ని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి ధ్వజమెత్తారు. రాముడి ఆస్తులున్న గ్రామాలను తెలంగాణలో విలీనం చేసుకునేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్‌ ఆయన చేశారు. గురువారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.

బయ్యారం స్టీల్‌ప్లాంట్‌ విషయంలో కేంద్ర రాష్ట్రాలు కుమ్మక్కు
‘ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం 2014’లో పేర్కొన్న చట్టబద్ధమైన హామీల సాధనలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైందని సుధాకర్‌ రెడ్డి విమర్శించారు. విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలు అమలయ్యేలా లేవనీ, రాహుల్‌ గాంధీ ప్రధాన మంత్రి అయితే హామీలన్నింటినీ అమలు చేస్తామని అన్నారు. బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌పై కేంద్రం ఇచ్చిన వివరణ అన్యాయమని ఆయన వాపోయారు. కేసీఆర్‌కు కేంద్రానికి మధ్య ఈ ప్లాంట్‌ విషయంలో జరిగిన రహస్య ఒప్పందమేంటో బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. బయ్యారం ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేసే ఆలోచనలో కేంద్ర, రాష్ట్రాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ నాయకులపై నిరాధార ఆరోపణలు, విమర్శలు చేయడానికి తప్పించి రాష్ట్ర బీజేపీ నాయకులు ఒరగబెట్టిందేం లేదని మండిపడ్డారు. పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలు గురించి ఒక్కసారైనా ప్రధాని మోదీతో మాట్లాడారా అని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు