మంత్రి ఆది కుటుంబంలో ఎమ్మెల్సీ చిచ్చు..!

9 Feb, 2019 11:46 IST|Sakshi
రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డి

సాక్షి, జమ్మలమడుగు : టీడీపీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి కొత్త సమస్య వచ్చిపడింది. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన పదవిని ఆది సోదరుడి కుటుంబానికి ఇచ్చేందుకు నిర్ణయం జరిగింది. చంద్రబాబు వద్దనే నారాయణరెడ్డి తన కుటుంబానికే ఎమ్మెల్సీ పదవి అంటూ ప్రకటించారు కూడా. ఇదిలాఉండగా.. షాద్‌నగర్‌ జంట హత్యల కేసులో ఆది వర్గానికి చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఆది బంధువు శంకర్‌ రెడ్డి ఒకరు. ఈ హత్యలకు కారణం రామసుబ్బారెడ్డి వర్గమేనని సుప్రీం కోర్టులో కేసు కూడా నడుస్తోంది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆది, రామసుబ్బారెడ్డి రాజీ పడటం, దీనిలో భాగంగా శంకర్ రెడ్డి కుటుంబీకులు సుప్రీం కోర్టులో ఉన్న కేసులో రాజీ పడుతున్నట్లు ఒప్పుకోవడం జరిగింది. ఈ రాజీని చంద్రబాబు దగ్గరుండి చేశారని వినికిడి.

దీంతో రామసుబ్బారెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ పదవిని ఆది కుటుంబానికి కాకుండా శంకర్ రెడ్డి కుటుంబానికి ఇవ్వాలనే డిమాండ్ మొదలయింది. నారాయణరెడ్డి ఇప్పటికే ఎమ్మెల్సీ పదవి అనుభవించారని, ఆయన కుమారుడు కూడా జడ్పీటీసీగా ఉన్నదని...మళ్లీ వాళ్ళకే ఎమ్మెల్సీ ఇవ్వడం సరికాదనే వాదన ప్రారంభమయ్యింది. అన్ని పదవులు అన్నదమ్ములకే ఇస్తే...ఇక ఆది వర్గం కోసం పనిచేసి హత్య కావించబడ్డ శంకర్ రెడ్డి కుటుంబానికి ఏం న్యాయం చేసినట్లు అవుతుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద రామసుబ్బారెడ్డి వదిలేసిన ఎమ్మెల్సీ సీటు ఆది కుటుంబంలో విభేదాలకు కారణం అవుతోంది.

మరిన్ని వార్తలు