ఎమ్మెల్సీగా ‘శేరి’ ప్రమాణస్వీకారం

16 Apr, 2019 13:10 IST|Sakshi
ఎమ్మెల్సీగా ప్రమాణం చేస్తున్న శేరి సుభాష్‌రెడ్డి

సాక్షి మెదక్‌ : మెతుకుసీమ ముద్దు బిడ్డ.. సీఎం కేసీఆర్‌కు అత్యంత విశ్వాసపాత్రుడు శేరి సుభాష్‌రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహాల్‌లో శాసనమండలి ఉప చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ సోమవారం ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి చురుకైన పాత్ర పోషించి.. ప్రత్యేక వాదాన్ని బలంగా వినిపించిన శేరికి శాసన సభ్యుల కోటా కింద టీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.

ఈ మేరకు ఇటీవల హైదరాబాద్‌లోని అసెంబ్లీ హా లులో జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం సాధిం చారు. ఆయనతోపాటు మరో నలుగురు సైతం ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. వీరితోపాటు కరీంనగర్‌–మెదక్‌–నిజామబాద్‌–ఆదిలాబాద్‌ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి కూర రఘోత్తం రెడ్డి సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. ఎమ్మెల్సీగా మెదక్‌ జిల్లాకు చెందిన శేరి సుభాష్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడంతో టీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీగా హైదరాబాద్‌కు తరలి వెళ్లాయి.

అంచెలంచెలుగా ఎదుగుతూ.. 
మెదక్‌ జిల్లా హవేళిఘణాపూర్‌ మండలం కూచన్‌పల్లి గ్రామానికి చెందిన శేరి విఠల్‌రెడ్డి–సుశీల దంపతుల కుమారుడు సుభాష్‌రెడ్డి. ప్రస్తుతం 57 ఏళ్ల వయసున్న సుభాష్‌రెడ్డికి భార్య లక్ష్మితోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సుభాష్‌రెడ్డి తండ్రి విఠల్‌రెడ్డి 1964–1971 వరకు మెదక్‌ సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన శేరి 1989లో రాజకీయ అరంగేట్రం చేశారు.

1989లో మండల యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. 1991లో యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా, 1993లో మెదక్‌ జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షుడిగా, 1997లో మెదక్‌ బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేసిన సుభాష్‌రెడ్డి 2001 ఏప్రిల్‌ 21న టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. 2001 నుంచి మండల పార్టీ అధ్యక్షుడి స్థాయి నుంచి టీఆర్‌ఎస్‌ రాష్ట్ర బాధ్యతలను చేపట్టారు. 2011 నుంచి సీఎం కేసీఆర్‌ రాజకీయ కార్యదర్శిగా వ్యవహరిస్తూ వచ్చారు. 2016 జూలైలో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.   

మరిన్ని వార్తలు