ఆ రూ.16వేల కోట్లు ఏం చేశారు చంద్రబాబు?

17 Feb, 2018 12:24 IST|Sakshi
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు

ఇంకేం బాకీ ఉన్నామో చంద్రబాబు చెప్పాలి: సోము వీర్రాజు

ఏపీలో బీజేపీ ఎదుగుతోందని టీడీపీ భయపడుతోంది

సాక్షి, శ్రీకాకుళం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు, టీడీపీ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి విరుచుకుపడ్డారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం రూ.16వేల కోట్లు ఇచ్చిందని, ఆ నిధులను ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. కేంద్రం ఇవ్వాల్సిందంతా ఇచ్చేసిందని, ఇంకేం బాకీ ఉన్నామో సీఎం చంద్రబాబు చెప్పాలన్నారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఎక్కువే సాయం చేసిందని, అడిగినదానికంటే ఎక్కువ ఇచ్చిందని, సంతృప్తిగా ఉన్నామని గతంలో చాలాసార్లు ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడెందుకు మాట మారుస్తున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో తాము ఎదుగుతామని టీడీపీకి భయం పట్టుకుందని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.

రాష్ట్ర విభజన చట్టం అమలుకు 2022 వరకు సమయం ఉందని, ఇప్పటి నుంచే ఉద్యమం చేయాల్సిన అవసరం లేదన్నారు. ఈ నాలుగేళ్లలో 60 శాతం పనులు పూర్తి చేశామని చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రానికి రూ.16 వేల కోట్లు ఇచ్చామని గుర్తుచేశారు. ఆ మొత్తాన్ని రైతు రుణమాఫీ పేరుతో ఖర్చుచేసి, అభివృద్ధిని పక్కన పెట్టారని మండిపడ్డారు. వెనుకబడిన జిల్లాలకి రూ.1050 కోట్లు పారిశ్రామిక రాయితీ కేటాయించామని, అయితే వాటిని ఒక్క పరిశ్రమకైనా ఆ నిధులు కేటాయించారా అని ప్రశ్నించారు. గత ఎన్నికల సమయంలో టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న వాటిని ఒక్కటైనా అమలు చేశారా అని సోము వీర్రాజు సూటిగా ప్రశ్నించారు.  నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ ఏదని అడిగారు. టీడీపీ మీడీయా ద్వారా రాష్ట్ర ప్రజల ముందు జీజేపీని దోషిని చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుతోందని టీడీపీకి భయం పట్టుకుందని ఆయన వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని వార్తలు