బెంగాల్‌లో ‘సిండికేట్‌’ రాజ్యం

17 Jul, 2018 01:37 IST|Sakshi
టెంట్‌ కూలడంతో గాయపడిన అమ్మాయి కోరడంతో ఆటోగ్రాఫ్‌ ఇస్తున్న మోదీ

ముడుపులు చెల్లిస్తేనే అనుమతులు ఇస్తున్నారు

త్వరలోనే తృణమూల్‌ పాలన నుంచి విముక్తి

కిసాన్‌ కళ్యాణ్‌ ర్యాలీలో మోదీ

మిడ్నాపూర్‌/కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో  సిం డికేట్‌ రాజ్యం నడుస్తోందనీ, దాని అను మతి లేకుండా రాష్ట్రంలో చిన్న అభివృద్ధి కార్యక్రమం కూడా జరగదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రజాస్వామ్యం గొంతు నొక్కేస్తోందని మండిపడ్డారు. పంచాయితీ ఎన్నికల సందర్భంగా బీజేపీ కార్యకర్తల్ని వరుసగా హత్యచేసినా ప్రజ లు తమవెంటే నిలిచారన్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ దుష్పరిపాలన నుంచి బెంగాలీలు త్వరలోనే విముక్తి పొందుతారన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామ న్నారు. పశ్చిమబెంగాల్‌లోని మిడ్నాపూర్‌లో సోమవారం నిర్వహించిన ‘కిసాన్‌ కళ్యాణ్‌ ర్యాలీ’లో మోదీ నిప్పులుచెరిగారు.

జనగణమన గడ్డపై: ‘జాతీయ గీతం జనగణమన, జాతీయ గేయం వందేమాతరం పుట్టిన భూమిని ప్రస్తుతం రాజకీయ సిండికేట్‌ పాలిస్తోంది. ఈ సిండికేట్‌ బుజ్జగింపు, ముడుపులు, ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోంది. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ సిండికేట్ల ద్వారా చిట్‌ ఫండ్లను నడుపుతూ రైతులకు దక్కాల్సిన లబ్ధిని లాగేసుకుంటోంది. చివరికి కేంద్రం పంపే నిధుల్ని సైతం వీరి అనుమతి లేకుండా ఖర్చుపెట్టడం కుదరడం లేదు’ అని మోదీ అన్నారు. తన పర్యటనను నిరసిస్తూ తృణమూల్‌ కార్యకర్తలు మమత ఫొటోలు, పోస్టర్లను సభలో ప్రదర్శించడంపై మోదీ స్పందిస్తూ.. ‘మేం సాధించిన విజయాలను తృణమూల్‌ కూడా అంగీకరిస్తోంది. అందుకే చేతులు జోడించిన సీఎం మమతా బెనర్జీ పోస్టర్లతో వాళ్లు ప్రధానికి స్వాగతం పలికారు’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

కూలిన టెంట్‌.. 67 మందికి గాయాలు
ప్రధాని కిసాన్‌ కళ్యాణ్‌ సభ సందర్భంగా ఏర్పాటుచేసిన భారీ టెంట్‌ కూలిపోవడంతో 13 మంది మహిళలు సహా 67 మంది గాయపడ్డారు. ప్రధాని ప్రసంగం సాగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.వెంటనే స్పందించిన మోదీ బాధితులకు సాయమందించాలని పక్కనే ఉన్న స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌(ఎస్పీజీ) అధికారుల్ని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు బాధితులకు ప్రథమ చికిత్స చేసి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మోదీ ప్రసంగం సందర్భంగా పలువురు కార్యకర్తలు టెంట్‌పైకి ఎక్కారు. చివరికి టెంట్‌ పైభాగంగా బరువు ఎక్కువ కావడంతో అది ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. క్షతగాత్రులకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందిస్తామని పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ తెలిపారు.
 

మరిన్ని వార్తలు