మోదీ షోలే సినిమాలో అస్రానీ: ప్రియాంక

18 May, 2019 04:02 IST|Sakshi
ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌లో నిర్వహించిన ర్యాలీలో కార్యకర్తలకు షేక్‌హ్యాండ్‌ ఇస్తున్న కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ

మిర్జాపూర్‌/గోరఖ్‌పూర్‌(యూపీ): నరేంద్ర మోదీ ఒక నటుడని, ప్రధాని పదవికి అమితాబ్‌ బచ్చన్‌ సరైన వ్యక్తి అని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా పేర్కొన్నారు. అమితాబ్‌ నటించిన షోలే సినిమాలోని ‘అస్రానీ’ పాత్ర మోదీకి సరిపోతుందని వ్యాఖ్యానించారు. శుక్రవారం మిర్జాపూర్, గోరఖ్‌పూర్‌లలో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో ఆమె పాల్గొన్నారు. ‘ప్రధాని మోదీ నాయకుడు కాదు, ఒక నటుడు. అమితాబ్‌ బచ్చన్‌ను ప్రధానిగా చేస్తే బాగుంటుంది. ‘బ్రిటిష్‌ వారి కాలంలో...’ అంటూ కనిపించిన ప్రతిసారీ ఒకే డైలాగ్‌ చెప్పే షోలే సినిమాలో అస్రానీ పాత్ర లాంటివాడు మోదీ.

నెహ్రూ, ఇందిర, రాజీవ్‌గాంధీ ఏం చేశారో ఆయన ఎప్పుడూ చెబుతుంటారు. గత ఐదేళ్లలో తను ఏం చేసింది మాత్రం ఎన్నడూ చెప్పరు’ అని ఎద్దేవా చేశారు. ఎన్నికల హామీల్లో ఒక్కటీ ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందన్నారు. ‘నోట్లరద్దుతో నల్లధనం వెనక్కివస్తుందని చెప్పారు. నల్లధనం తీసుకురాలేకపోయారు. దానివల్ల కష్టాలు మాత్రం వచ్చాయి’ అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను బీజేపీ ప్రభుత్వం బలహీనం చేసిందని ఆరోపించారు. రైతులకు ఇవ్వాల్సిన బీమా సొమ్ము పారిశ్రామికవేత్తలకు, బీమా కంపెనీలకు చేరిందని విమర్శించారు.

మరిన్ని వార్తలు