మోదీ కేబినెట్‌పై మిత్రపక్షాల కన్ను

27 May, 2019 04:16 IST|Sakshi

గంపెడాశలు పెట్టుకున్న జేడీయూ, అన్నాడీఎంకే

రాజ్‌నాథ్, సుష్మ, గడ్కారీ వంటి సీనియర్లకు మరో చాన్స్‌

తెలంగాణ, బెంగాల్‌ రాష్ట్రాలకు కేబినెట్‌ బెర్త్‌

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ మెజారిటీతో అధికారంలోకి రావడంతో మంత్రివర్గ కూర్పుపై అన్నివర్గాల్లో ఆసక్తి నెలకొంది. మోదీ కేబినెట్‌లో చోటు కోసం బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ నేతృత్వంలోని జనతాదళ్‌ యునైటెడ్‌(జేడీయూ), అన్నాడీఎంకే పార్టీలు గంపెడాశలు పెట్టుకున్నాయి. బిహార్‌లో బీజేపీతో పొత్తుకు ప్రతిఫలంగా మోదీ మంత్రివర్గంలో జేడీయూకు 1–2 మంత్రి పదవులు దక్కే అవకాశముందని తెలుస్తోంది. మే 30న ప్రధాని మోదీతో కలిసి వీరు ప్రమాణస్వీకారం చేస్తారని సమాచారం.

దీంతో పాటు పశ్చిమబెంగాల్‌లో ఈసారి 18 లోక్‌సభ సీట్లు దక్కించుకున్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలను కేబినెట్‌లోకి తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. తమిళనాడులో పట్టుకోసం బీజేపీ కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది. తాజా ఎన్నికల్లో ఒకే సీటు దక్కించుకున్న అన్నాడీఎంకేకు కూడా కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కవచ్చని తెలుస్తోంది. దీనివల్ల తమిళనాడులో బీజేపీ క్షేత్రస్థాయిలో బలపడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అలాగే ఈ ఎన్నికల్లో 6 స్థానాలు దక్కించుకున్న ఎల్జేపీ అధినేత రామ్‌విలాస్‌ పాశ్వాన్‌తో పాటు బీజేపీ నేతలు రాజ్‌నాథ్‌ సింగ్, నితిన్‌ గడ్కారీ, నిర్మలా సీతారామన్, రవిశంకర్‌ ప్రసాద్, పీయూష్‌ గోయల్, నరేంద్రసింగ్‌ తోమర్, ప్రకాశ్‌ జవదేకర్‌లు మరోసారి మంత్రి పదవులు దక్కించుకోనున్నట్లు సమాచారం. గాంధీనగర్‌ నుంచి భారీ మెజారిటీతో గెలుపొందిన బీజేపీ చీఫ్‌ అమిత్‌ షాకు కీలక మంత్రి బాధ్యతలు అప్పగిస్తారని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై స్పందించేందుకు షా నిరాకరించారు. 2014 ఎన్నికల్లో తెలంగాణలో ఒక సీటుతో సరిపుచ్చుకున్న బీజేపీ, ఈసారి ఏకంగా నాలుగు సీట్లు దక్కించుకోవడంతో రాష్ట్రంలో పార్టీ విస్తరణకు బీజేపీ ప్రాధాన్యత ఇస్తోందనీ, కాబట్టి తెలంగాణ నుంచి కేబినెట్‌లో ఒకరికి చోటు దక్కే అవకాశముందంటున్నారు.

మరిన్ని వార్తలు