మోదీ గొప్ప మాటకారి

9 May, 2018 01:14 IST|Sakshi

ప్రసంగాలతో పేదరికం పోదు, ఉద్యోగాలు రావు: సోనియా

విజయపుర/సాక్షి, బళ్లారి/బెంగళూరు: ప్రధాని మోదీ గొప్ప నటుడిలా మాట్లాడతారనీ, కానీ ఒట్టి మాటలతో దేశం కడుపు నిండదని యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. మోదీ మంచి వక్తేననీ, మాటలతో ప్రజల కడుపు నిండేలా ఉంటే మోదీ మరిన్ని ప్రసంగాలు చేయాలని తాను కోరుకునేదానినని ఆమె ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ మాజీ అధినేత్రి సోనియా దాదాపు రెండేళ్ల విరామం తర్వాత మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కర్ణాటకలోని విజయపుర జిల్లా బబలేశ్వర్‌లో ఆమె మాట్లాడుతూ ‘మోదీకి కాంగ్రెస్‌ ముక్త భారత్‌ అనే భూతం పట్టుకుంది.

నాలుగేళ్లుగా ఆయన ప్రధాని పదవిలో ఉంటూ ఎక్కడికి వెళ్లినా అబద్ధాలు చెప్పడమే పనిగా పెట్టుకున్నారు. ఆయన సాధించిందేమిటంటే మా ప్రభుత్వం చేసిన మంచిని చెరిపేయడం. ఉత్తుత్తి మాటలు ప్రజలకు మేలు చేస్తాయా? పేదరిక నిర్మూలన జరుగుతుందా? యువతకు ఉద్యోగాలు వస్తాయా? ఎందుకూ పనికిరాని మాటలను మాట్లాడుతూ దేశ ప్రజలను బురిడీ కొట్టిస్తున్న మోదీకి కర్ణాటక ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పండి’ అని సోనియా నిప్పులు చెరిగారు.

‘కాంగ్రెస్‌నే కాదు.. మోదీ తన ముందు నిలబడిన ఎవరినీ సహించలేరు. ఆయన ఎక్కడికెళితే అక్కడ తప్పులు, అబద్ధాలు మాట్లాడటాన్ని చూసి దేశం విస్తుపోతోంది. చరిత్రను వక్రీకరిస్తారు. స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసం గొప్పగొప్ప స్వాతంత్య్ర సమరయోధులను పావులుగా వాడుకుంటారు. ఇప్పటి సమస్యల గురించి మోదీ మాట్లాడరు. ఎన్నికల్లో ఆయన చేసిన వాగ్దానాల గురించి నోరెత్తరు. అన్నీ అనవసర విషయాలనే ప్రస్తావిస్తారు. అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి వాడాల్సిన భాషేనా అసలు అది’ అని సోనియా తీవ్రస్థాయిలో మోదీపై విరుచుకుపడ్డారు.

మరిన్ని వార్తలు