కీలక నిర్ణయంపై మరోసారి అఖిలపక్షం భేటీ

16 Jun, 2019 18:57 IST|Sakshi

మరోసారి తెరపైకి ఒకేదేశం-ఒకేసారి ఎన్నికలు

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు అంశంపై కసరత్తు చేస్తోంది. దీనిపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు పార్లమెంట్‌ ఉభయసభల్లో ప్రాతినిథ్యం ఉన్న అన్ని రాజకీయ పార్టీల  అధ్యక్షులను అఖిలపక్ష సమావేశానికి మోదీ ఆహ్వానించారు. ఈనెల 19న ఈ సమావేశం జరుగనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషీ తెలిపారు.

అలాగే ఈ ఏడాది మహాత్మా గాంధీ 150వ జయంత్యుత్సవాల నిర్వహణతోపాటు, భారత దేశం 2022లో 75వ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకోబోతున్న నేపథ్యంలో ఉత్సవాల నిర్వహణ గురించి కూడా ఈ సమావేశంలో చర్చిస్తారని తెలిపారు. వీటితో పాటు మరో ఐదు అంశాలపై కూడా అఖిలపక్షం చర్చించనుంది. కాగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి జరగనున్న నేపథ్యంలో ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో ఆదివారం ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీ ముగిసిన విషయం తెలిసిందే. ఉభయసభలు సజావుగా జరిగేలా సహకరించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది.

మరిన్ని వార్తలు