మోదీ అభిమానిపై దాడి

15 Apr, 2019 08:58 IST|Sakshi
మృతుడు గోవిందరాజ్‌

టీ.నగర్‌(చెన్నై): తంజావూరులో నరేంద్ర మోదీకి మద్దతుగా ప్రచారం చేస్తున్న వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు. దీనికి సంబంధించి బస్సు డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తంజావూరు సమీపంలోని ఒరత్తనాడు తెన్నమనాడు గ్రామానికి చెందిన వృద్ధుడు గోవిందరాజ్‌ (75) సామాజికవేత్త. వెటర్నరీ ఉద్యోగిగా పనిచేసి రిటైర్డ్‌ అయ్యారు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబంలో ఏర్పడిన అభిప్రాయభేదాల కారణంగా విడిగా ఉంటున్నారు. ప్రధాని మోదీ అంటే వల్లమాలిన అభిమానం. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా ఒరత్తనాడు పరిసర ప్రాంతాల్లో మోదీకి ఓటేయండని ప్రాధేయపడేవాడు.

ఒరత్తనాడు అన్నా విగ్రహం సమీపంలో శనివారం రాత్రి మెడలో మోదీ చిత్రపటాన్ని తగిలించుకుని దుకాణదారుల వద్ద ప్రచారం చేస్తున్నారు. ఆ సమయంలో ప్రైవేటు బస్సు డ్రైవర్‌ గోపినాథ్‌ (33) అక్కడికి వచ్చారు. మోదీకి ఎలా ప్రచారం చేస్తావని గోవిందరాజ్‌తో తగాదాకు దిగాడు. వారి మధ్య వాగ్వాదం పెరగడంతో గోపీనాథ్‌ ఆగ్రహంతో గోవిందరాజన్‌పై దాడి చేశాడు. దీంతో గోవంద్‌రాజన్‌ స్పృహ తప్పి పడిపోయాడు. స్థానికులు ఒరత్తనాడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. దీనిపై గోవిందరాజ్‌ కుమార్తె అర్బుతరసు ఒరత్తనాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి గోపీనాథ్‌ను అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న బీజేపీ, అన్నాడీఎంకే వర్గాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భద్రత కల్పించారు. గోపీనాథ్‌.. డీఎంకే-కాంగ్రెస్‌ మద్దతుదారుడిగా భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు