బీజేపీ ప్రణాళికాబద్ధంగా దెబ్బతీస్తోంది

22 Nov, 2018 04:02 IST|Sakshi
మన్మోహన్‌ సింగ్‌

ఇందుకోసం పార్లమెంటు, సీబీఐని నాశనం చేస్తోంది

మాజీ ప్రధాని మన్మోహన్‌ ధ్వజం

ఖండించిన బీజేపీ

ఇండోర్‌: పార్లమెంటు, కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ), రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) వంటి సంస్థల ప్రతిష్టను మోదీ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా దెబ్బతీస్తోందని మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత మన్మోహన్‌ సింగ్‌ తెలిపారు. తద్వారా ఓ క్రమపద్ధతిలో, వ్యూహాత్మకంగా భారత ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపర్చేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. మోదీ హయాంలో అవినీతి విలయతాండవం చేస్తోందని ధ్వజమెత్తారు. మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం నాడిక్కడ నిర్వహించిన మీడియా సమావేశంలో మన్మోహన్‌ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

కేంద్రం, ఆర్బీఐ మధ్య సహకారంపై
‘దేశంలో పార్లమెంటు, సీబీఐ వంటి సంస్థల ప్రతిష్టను మోదీ ప్రభుత్వం దిజారుస్తోంది. జాగ్రత్తగా, వ్యూహాత్మకంగా వీటిని దెబ్బతీస్తోంది. తద్వారా దేశంలోని ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చేందుకు యత్నిస్తోంది. ప్రస్తుతం దేశంలో సమన్యాయంపై దాడి జరుగుతోంది. ఈ పరిస్థితి ఇప్పుడు మారకుంటే చరిత్ర ఈ తరాన్ని ఎన్నటికీ క్షమించదు. మోదీ ప్రభుత్వం ఆర్బీఐ, సీబీఐ వంటి సంస్థలపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తోంది. ఇది దేశ ప్రజాస్వా మ్యానికి, చట్టాలకు ప్రమాదకరం. ఇక కేంద్ర ఆర్థికశాఖ, ఆర్బీఐల మధ్య సంబంధాలు ఎన్నడూలేనంతగా దిగజారాయి’ అని అన్నారు.

దుర్భాషలు ప్రధాని హోదాకు తగదు
పెద్ద నోట్ల రద్దు, వస్తుసేవల పన్ను (జీఎస్టీ)పై విలేకరులు అడిగిన ప్రశ్నకు మన్మోహన్‌ స్పందిస్తూ.. ‘‘పెద్ద నోట్ల రద్దు అన్నది ‘వ్యవ స్థాగత లూటీ–చట్టబద్ధమైన దోపిడీ’గా తయారైంది. ఈ నిర్ణయంతో దేశంలోని అసంఘటిత రంగానికి తీవ్రనష్టం వాటిల్లింది. నోట్ల రద్దు లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైంది. ఇలాంటి ఆర్థిక దుస్థితిని కల్పించిన ప్రభుత్వాన్ని వదిలించుకోవాలా? వద్దా? అన్నది ప్రజలే నిర్ణయించుకోవాలి. తన రాజకీయ ప్రత్యర్థులపై మోదీ దుర్భాషలకు దిగుతున్నారు. ఓ ప్రధానికి ఇలాంటి భాష ఎన్నటికీ శోభనివ్వదు’’ అని వెల్లడించారు.

నాది రిమోట్‌ కంట్రోల్‌ సర్కార్‌ కాదు
తనది రిమోట్‌ కంట్రోల్‌ ప్రభుత్వమని 2014 ఎన్నికల సందర్భంగా బీజేపీ చేసిన విమర్శలకు సమాధానమిస్తూ.. ‘అది ఎంతమాత్రం నిజం కాదు. మా పార్టీ (కాంగ్రెస్‌), ప్రభుత్వం ఒకేతాటిపై ఉన్నాయి. మామధ్య ఎలాంటి అభిప్రాయభేదాలు అప్పట్లో లేవు. యూపీఏ హయాంలో అవినీతి జరిగిందని మీడియాను, దేశ ప్రజలను బీజేపీ తప్పుదోవ పట్టించింది. ఈ విషయంలో ప్రజలకు మేం సరిగ్గా జవాబు ఇవ్వలేకపోయాం’ అని పేర్కొన్నారు. మరోవైపు, ఈ ఆరోపణల్ని బీజేపీ ఖండించింది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ పదేళ్ల పాలనలో సీబీఐ వంటి కేంద్ర సంస్థలపై ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చేదని బీజేపీ అధికార ప్రతినిధి గోపాల్‌కృష్ణ అగర్వాల్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు