‘అవిశ్వాస’మంటే కేంద్రానికి భయం

26 Mar, 2018 02:31 IST|Sakshi

కార్పొరేట్లకు దోచిపెట్టడమే మోదీ సాధించిన ఘనత: రాహుల్‌

సాక్షి, బెంగళూరు: పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానికి కేంద్రం భయపడుతోందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ అన్నారు. మైసూరులో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. 10 రోజులుగా అవిశ్వాస తీర్మానం పెండింగ్‌లో ఉందని, దాన్ని చర్చకు చేపట్టేందుకు మోదీ ప్రభుత్వం ధైర్యం చేయడంలేదని విమర్శించారు. ఆంధ్రా పార్టీలు వైఎస్సార్సీపీ, టీడీపీ తరువాత కాంగ్రెస్‌ ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసేలా కార్పొరేట్‌ సంస్థలకు అవకాశం కల్పించడమే బీజేపీ ప్రభుత్వం చేసిన అతిపెద్ద ఘనకార్యమని రాహుల్‌ ఆరోపించారు.  

బీజేపీ వల్లే కశ్మీర్‌లో అస్థిరత..
ఒకప్పుడు మనకు మిత్ర దేశాలుగా ఉన్న నేపాల్, మయన్మార్, శ్రీలంక, మాల్దీవులు లాంటి దేశాలు ఇప్పుడు చైనాకు దగ్గరయ్యాయని తెలిపారు. కశ్మీర్‌లో ఉగ్రవాదం వెన్నెముకను యూపీఏ ప్రభుత్వం విరిచేసిందని, కానీ ఆ రాష్ట్రంలో బీజేపీ మద్దతుతో పీడీపీ అధికారంలోకి వచ్చాక ఉగ్ర దాడులతో హింస యథావిధిగా కొనసాగుతోందని పేర్కొన్నారు.  

నమో యాప్‌తో డేటా దుర్వినియోగం
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ అధికార ‘నమో యాప్‌’ ద్వారా ప్రజల అనుమతి లేకుండానే వారి సమాచారం విదేశీ కంపెనీలకు చేరుతోందని రాహుల్‌ ఆరోపించారు. ‘హాయ్‌..నేను భారత ప్రధానిని. నా అధికార యాప్‌ని వాడుకుంటే మీ సమాచారాన్నంతా అమెరికా కంపెనీల్లోని నా స్నేహితులకు ఇస్తా’ అని రాహుల్‌ ట్వీట్‌చేశారు. యాప్‌తో సమాచారం దుర్వినియోగమవుతోందన్న ఓ ఫ్రెంచ్‌ హ్యాకర్‌ ఆరోపణల ఆధారంగా ప్రచురితమైన కథనంపై రాహుల్‌ ఈ స్పందించారు. కాగా, రాహుల్‌ ఆరోపణలను బీజేపీ ఖండించింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడి నుంచి ఇంతకన్నా గొప్ప మాటలు ఆశించలేమని బీజేపీ తిప్పికొట్టింది.

మరిన్ని వార్తలు