పీఎంవోను దిగజార్చారు

21 Mar, 2019 03:24 IST|Sakshi
ఇంఫాల్‌లో రాహుల్‌తో సెల్ఫీ దిగుతున్న విద్యార్థిని

పబ్లిసిటీ మినిస్టర్‌ ఆఫీస్‌గా మార్చారని మోదీపై రాహుల్‌ ఫైర్‌

ఇంఫాల్‌/ఖుముల్వాంగ్‌: ప్రధాని మోదీ ప్రధానమంత్రి కార్యాలయాన్ని (పీఎంవో) పబ్లిసిటీ మినిస్టర్‌ ఆఫీసుగా దిగజార్చారని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ ఆరోపించారు. ప్రధాని పీఎంవోను తన మార్కెటింగ్‌ కోసం ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లో ర్యాలీలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని ప్రధాని ప్రగల్భాలు పలికారని గుర్తు చేశారు. ప్రధాని మోదీ ఏం చదివారో ఇప్పటివరకు ఎవరికీ తెలియదని రాహుల్‌ వ్యాఖ్యానించారు. అసలు ఆయన ఏదైనా యూనివర్సిటీకైనా వెళ్లారో లేదో అని ఎద్దేవా చేశారు. ప్రధాని డిగ్రీకి సంబంధించి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసినా ఇప్పటి వరకు స్పందన రాలేదని వాపోయారు. మణిపూర్‌ వర్సిటీలో అప్పటి వీసీ ఏపీ పాండే తీరును వ్యతిరేకిస్తూ విద్యార్థులు నిరసన వ్యక్తం చేయడాన్ని రాహుల్‌ ప్రస్తావించారు.

ప్రజలంతా మూర్ఖులని మోదీ భావన
ఎన్నికల ర్యాలీలో ప్రియాంక గాంధీ
మిర్జాపూర్‌: ప్రజలంతా మూర్ఖులనే భావనలో ప్రధాని మోదీ ఉన్నారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియాంక యూపీలో మూడు రోజులపాటు గంగా యాత్రలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ‘ఐదేళ్లుగా ప్రధాని దేశంలోని ప్రతి వ్యవస్థపై దాడి చేస్తూనే ఉన్నారు. అందులో మీరు కూడా ఒక భాగమే. వేధింపులకు గురిచేస్తే నేను భయపడను. పోరాడుతా’ అని చెప్పారు. ‘కాంగ్రెస్‌ ప్రభుత్వం అతిపెద్ద ఉపాధికల్పన పథకం ఎమ్‌జీఎన్‌ఆర్‌ఈజీఏను (మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) ప్రవేశపెట్టింది. కానీ బీజేపీ ప్రభుత్వం శ్రామికుల స్థానంలో మెషీన్లతో పనులు పూర్తి చేస్తోంది’అని ఆమె ఆరోపించారు. వారణాసి రామ్‌నగర్‌లోని మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి పూర్వీకుల ఇంట్లో శాస్త్రి విగ్రహం వద్ద నివాళులర్పించారు.

వారణాసిలో చిన్నారితో సెల్ఫీకి పోజిస్తున్న ప్రియాంక

మరిన్ని వార్తలు